సబ్‌మెరైన్ల సమాచారం లీక్ … ముగ్గురు నేవీ అధికారుల అరెస్ట్

గూఢచర్యం ఆరోపణలపై ఒక కమాండర్ ర్యాంక్ నేవీ ఆఫీసర్ సహా మరో ఇద్దరు రిటైర్డ్ అధికారులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది. సర్వీస్ లో ఉన్న అధికారి  జలాంతర్గాముల (సబ్ మెరైన్) ఆధునికీకరణకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఇద్దరు రిటైర్డ్ అధికారులకు చేరవేస్తున్నాడని తెలియడంతో సీబీఐ అరెస్ట్ చేసింది. 
మరో వైపు ఈ వ్యవహారంపై భారత నేవీ కూడా ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. వైస్ అడ్మిరల్, రియర్ అడ్మిరల్ ర్యాంకు అధికారులతో కూడిన బృందం దీనిపై దర్యాప్తు చేస్తోంది. ఈ లీకేజీ వ్యవహారంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపైనా ఈ దర్యాప్తు అధికారుల బృందం నివేదిక ఇవ్వనుంది. 
 
ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు త్రివిధ దళాలకు సంబంధించిన రిటైర్డ్ అధికారులపై నిఘా వేసి ఉన్నాయని, నిఘా సమాచారం ఆధారంగానే ప్రస్తుతం ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న కిలో క్లాస్ సబ్ మెరైన్ మోడరనైజేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ తో సమానమైన నేవీ కమాండర్ ర్యాంక్ అధికారి  లీక్ చేస్తున్నాడన్న సమాచారం సంబంధిత ఏజెన్సీల నుంచి అందడంతో సీబీఐ రంగంలోకి దిగి అరెస్టు చేసిందని తెలుస్తోంది. 

ఆ అధికారితో పాటు అతడి నుంచి సమాచారం అందుకుంటున్న ఇద్దరు రిటైర్డ్ నేవీ అధికారులను కూడా సీబీఐ అరెస్టు చేసింది. ఆ సమాచారాన్ని వాళ్లు ఎక్కడికి చేరవేస్తున్నారన్న దానిపై సీబీఐ అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు. లీకైన డేటా పాకిస్థాన్ ఏజెన్సీలకు చేరిందా? లేక వాళ్ల వద్దనే ఉందా అన్న దానిపైనా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అలాగే అరెస్ట్ అయిన వారితో గతంలో టచ్ లో ఉన్న నేవీ ఆఫీసర్లను కూడా సీబీఐ విచారిస్తున్నట్లు డిఫెన్స్ వర్గాలు చెబుతున్నాయి. 

నేవీ కూడా ఈ దర్యాప్తుకు అన్ని రకాలుగా సహకరిస్తోందని తెలిపాయి. దేశ రక్షణకు సంబంధించిన అంశం కావడంతో నేవీ కూడా సమాతరంగా వైస్ అడ్మిరల్, రియర్ అడ్మిరల్ సహా ఐదుగురు సభ్యులతో కూడిన టీమ్ దర్యాప్తు చేస్తోంది.

నేవీ వర్గాల సమాచారం ప్రకారం, ముంబైకి చెందిన సర్వీస్ అధికారి రహస్య సమాచారాన్ని పంచుకున్నట్లు ఆరోపించారు. కిలో క్లాస్‌ సబ్‌మెరైన్లను సోవియట్ యూనియన్.. సోవియట్ నౌకాదళం కోసం నిర్మించింది. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన సాంప్రదాయ జలాంతర్గాముల్లో ఒకటి. 

భారతదేశంలో ఈ జలాంతర్గాములు సింధు ఘోష్ వర్గం క్రింద ఉంచారు. ఇలాంటి 10 జలాంతర్గాములను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆధునీకరించింది. భారత నౌకాదళం వద్ద ప్రస్తుతం 15 సాంప్రదాయ జలాంతర్గాములు, రెండు అణు జలాంతర్గాములు ఉన్నాయి.