వాతావరణ మార్పులతో భారత్ కు రూ 65.36 వేల కోట్ల నష్టం

ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులతో భారత్‌తో పాటు పలు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. గత ఏడాది వచ్చిన తుఫాన్లు, వర్షాలు, వరదలు, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా భారత్‌ రూ.87 బిలియన్‌ డాలర్లను (సుమారు రూ. 65.36వేల కోట్లు) కోల్పోయినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యుఎంఒ) అంచనా వేసింది. 
 
ఈ విషయాన్ని ‘స్టేట్‌ ఆఫ్‌ ద క్లైమెట్‌ ఇన్‌ ఆసియా’ పేరుతో మంగళవారం విడుదల చేసిన ఓ నివేదికను పేర్కొంది. ఈ నెల 31న స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో జరగనున్న శిఖరాగ్ర సమావేశం క్లైమెట్‌ చేంజ్‌ కాన్ఫరెన్స్‌ (కాప్‌26) ప్రారంభించడానికి కొద్ది రోజుల ముందు ఈ నివేదిక వచ్చింది. 
 
ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా అనేక వేల కోట్ల రూపాయల సగటు వార్షిక నష్టం (ఎఎఎల్‌) వాటిల్లినట్లు ఐక్యరాజ్యసమితి ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ కమిషన్‌ ఫర్‌ ఇండియా అండ్‌ పసిఫిక్‌ (ఇఎస్‌సిఎపి) అంచనా వేసినట్లు డబ్ల్యుఎంఒ తన నివేదికలో పేర్కొంది.
 
కాగా, ప్రకృతి ప్రకోపం కారణంగా భారీ స్థాయిలో నష్టాన్ని చవిచూసిన దేశం చైనా. ఇది సుమారు రూ.238 బిలియన్‌ డాలర్లు (రూ.178.79 వేల కోట్లు)ను నష్టపోయింది. ఆ తర్వాతి స్థానంలో భారత్‌, జపాన్‌ రూ.83 బిలియన్‌ డాలర్లు (6.23 వందల కోట్లు)ను కోల్పోయింది. కరువుతో అత్యధికంగా ఎఎఎల్‌ జరిగిందని డబ్ల్యుఎంఒ పేర్కొంది.

అదేవిధంగా ఆసియాలో గత ఏడాది ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయని, 1981-2010 సగటు ఉష్ణోగ్రత కన్నా 1.39 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత నమోదైనట్లు డబ్యుఎంఒ తెలిపింది. ఈ నివేదిక ప్రకారం.. రష్యాలోని వెర్కోయాన్స్క్‌లో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటి వరకు ఉత్తర ఆర్కిటిక్‌ ప్రాంతంలో ఇదే రికార్డు స్థాయి ఉష్ణోగ్రత.
 
దక్షిణ, తూర్పు ఆసియాలో గత సంవత్సరం వేసవి రుతుపవనాలు అస్తవ్యస్తంగా ఏర్పడ్డాయి. దీంతో అక్కడ తుఫాన్లు వచ్చి వరదలను సృష్టించి.. కొండ చరియలు విరిగి పడటం వల్ల అనేక దేశాల్లో తీవ్ర ప్రాణ నష్టం కలిగింది. ఇటీవల కాలంలో ఏర్పడ్డ బలమైన తుఫానుల్లో అంఫన్‌ ఒకటి. మే 2020లో భారత్‌, బంగ్లాదేశ్‌లపై విరుచుకుపడింది. దీంతో భారత్‌లో 24 లక్షల మంది నిరాశ్రయులవ్వగా, బంగ్లాదేశ్‌లో 25 లక్షల మంది ఆశ్రయాన్ని కోల్పోయినట్లు నివేదిక పేర్కొంది. 
 
గత ఏడాది సీజనల్‌ వర్షాలు, తీవ్ర తుఫాన్లు, వరదలు.. దక్షిణ, తూర్పు ఆసియాల్లోని అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో భారత్‌, చైనా, బంగ్లాదేశ్‌, జపాన్‌, పాకిస్తాన్‌, నేపాల్‌, వియత్నాం లలో అనేక మంది నిరాశ్రయులయ్యారు.