చైనాలో మరోసారి కఠిన లాక్‌డౌన్

యావత్‌ ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి ఇప్పుడు దాని పుట్టినిల్లయిన చైనాను మరోసారి వణికిస్తోంది. గత కొద్దిరోజులుగా చైనాలో కరోనా కేసులు ఎక్కువవడంతో మరోసారి కఠిన లాక్‌డౌన్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. పలు ప్రాంతాల్లో స్కూళ్లు, పర్యాటక ప్రదేశాలను మూసివేసింది. 
 
 ఉత్తర చైనా ఇన్నర్ మంగోలియా అటానమస్ ప్రాంతంలో కరోనా కేసులు మళ్లీ పెరగడంతో అధికారులు లాక్‌డౌన్ విధించారు. చైనాలో గత వారం రోజుల్లో 150కిపైగా కేసులు వెలుగు చూడగా, వీటిలో దాదాపు మూడోవంతు కేసులు ఈ ప్రాంతంలోని అలగ్జా లెఫ్ట్ బ్యానర్‌లోనే నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం 1.8 లక్షల మంది నివసిస్తున్నారు.
 
తాజా కేసుల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఎజిన్ బ్యానర్‌లోని 35,700 మంది ప్రజలను బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి ఆంక్షలే ఎరెన్‌హాట్‌లోనూ ఉన్నాయి. ఆదేశాలను ఉల్లంఘించి బయటకు వస్తే సివిల్,  క్రిమినల్ కేసులు తప్పవని తీవ్రంగా హెచ్చరించింది.
తాజాగా 40 లక్షల జనాభా కలిగిన లాన్‌జువో నగరంలో కరోనా కేసులు ఎక్కువవడంతో లాక్‌డౌన్‌ విధించింది. అక్కడి ప్రజలను అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది .విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఎజిన్ బ్యానర్ ఆరోగ్య కమిషనర్ ‌సహా ఆరుగురిపై ప్రభుత్వం వేటేసింది. 
 
చైనాలో మూడింట‌ ఒక వంతు అంటే దాదాపు 11 ప్రావిన్స్‌ల‌లో కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. గ‌త‌ వారం రోజుల వ్యవధిలో ఈ 11 ప్రావిన్స్‌ల‌లో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. చైనాలో గత కొద్దిరోజులుగా డెల్టా వేరియంట్‌ విజృంభణ కొనసాగుతోంది.
గాన్సు, ఇన్నర్ మంగోలియా, నింగ్ క్సియా, గుయిజౌ, బీజింగ్ ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న‌ది. దాంతో ఆయా ప్రాంతాల్లో ప‌ర్యాట‌క ప్ర‌దేశాలను అధికారులు మూసివేశారు. మరోవైపు దేశ రాజధాని బీజింగ్‌లో ఇప్పటివరకు 14 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నగరంలోకి వచ్చే వారికి అధికారులు క‌ఠిన‌ నిబంధనలు అమ‌లు చేస్తున్నారు.
ఇప్పటికే వందకు పైగా కొత్త కేసులు బయటపడడంతో.. రానున్న రోజుల్లో వైరస్‌ నిర్ధారణ పరీక్షలు పెంచనున్నట్లు వైద్య ఆరోగ్య సిబ్బంది వెల్లడించారు. వైరస్‌ నిర్ధారణ పరీక్షలు మాత్రమే కాదు.. చైనాలో వ్యాక్సిన్‌ పంపిణీ కూడా శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 200 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేసినట్లు సమాచారం.