బుల్లెట్‌ ప్రూఫ్‌షీల్డ్‌ తొలగించి ప్రసంగించిన అమిత్ షా

మూడు రోజుల జమ్మూ కాశ్మీర్ పర్యటనలో చివరి రోజైన సోమవారం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వేదిక మీదకు ఎక్కి ప్రసంగించడానికి ముందు తాను ధరించిన బుల్లెట్‌ ప్రూఫ్‌షీల్డ్‌ని తొలగించి అందరిని విస్మయంకు గురిచేశారు. షేర్‌ ఈ కశ్మీర్‌ ఇంటర్నెషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించడానికి ముందు ఆయన చేసిన ఈ పని అక్కడున్న వారిని ఒకింత భయంకు గురిచేసింది. 

జ‌న సందోహాన్ని చూశాక నేరుగా ప్ర‌జ‌ల‌తో మాట్లాడాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు చెప్పారు. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో బుల్లెట్ ఫ్రూప్ షీల్డ్‌ను వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా సిబ్బంది ధ్వంసం చేశాక అమిత్‌షా మాట్లాడారు. అనంతరం అమిత్‌ షా మాట్లాడుతూ.. ‘‘నన్ను దూషించారు, అడ్డుకున్నారు. కానీ నేను జమ్మూకశ్మీర్‌ ప్రజలతో సూటిగా, స్పష్టంగా మాట్లాడాలనుకున్నాను. అందుకే బుల్లెట్‌ ప్రూఫ్‌ షీల్డ్‌, సెక్యూరిటీని తొలగించాను. ఫరూఖ్‌ సాహెబ్‌ నన్ను పాకిస్తాన్‌తో మాట్లాడమని సూచించారు. కానీ నేను కాశ్మీర్ లోయలో ఉన్న యువత, ప్రజలతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను’’ అని తెలిపారు. 

కానీ ఈ రోజు మీతో స్వేచ్ఛ‌గా  మాట్లాడాల‌నుకుంటున్నా.. నాకు బుల్లెట్ ప్రూఫ్ గానీ, భ‌ద్ర‌త గానీ లేవు. మీ ముందు నిలిచాను అని భావోద్వేగ భ‌రితంగా మాట్లాడారు.జ‌మ్ముక‌శ్మీర్‌తోపాటు నూత‌నంగా ఏర్పాటు చేసిన ల‌డ‌ఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల‌ను అభివృద్ధి చేయాల‌న్న ఒకే ఒక్క కార‌ణంతో 370 అధిక‌ర‌ణాన్ని ర‌ద్దు చేశాం. 2024 నాటికి త‌మ ప్ర‌భుత్వం చేసిన ప్ర‌య‌త్నాల ఫ‌లితాలు మీరు చూడొచ్చు అని అమిత్‌షా భరోసా వ్యక్తం చేశారు.

జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి–నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫారూఖ్‌ అబ్దుల్లా పాకిస్తాన్‌తో చర్చలు జరపాలంటూ గడచిన మూడు రోజుల్లో రెండు సార్లు సూచించారు. కానీ, పలుమార్ల పాకిస్తాన్‌ ద్రోహాలతో, మరీ ముఖ్యంగా పుల్వామా దాడితో కేంద్రానికి మబ్బులు వీడి, కేంద్రమంత్రి ఆ సూచనల్ని తోసిపుచ్చారు. 

‘నయా కశ్మీర్‌’ కోసం కశ్మీరీ యువతరంతోనే మాట్లాడతానంటూ తెగేసి చెప్పడం గమనార్హం. ప్రతిపక్ష కశ్మీరీ నేతలపై విరుచుకు పడడమే కాక సోమవారం డల్‌ సరస్సులో మిరుమిట్లు గొలిపే దీపకాంతుల మధ్య సాంస్కృతిక ప్రదర్శనల్లో షా పాల్గొన్నారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనే భావన కలిగించేందుకు శతవిధాల ప్రయత్నించారు.

షార్జాకు విమాన సర్వీసు, ఐఐటీ కొత్త ప్రాంగణం ప్రారంభోత్సవం వగైరా చేశారు. ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌లో అవినీతి, బంధుప్రీతి, తీవ్రవాదం నశించి, మునుపెన్నడూ లేని అభివృద్ధి జరుగుతోందని తన పర్యటనలో కశ్మీరీ యూత్‌ క్లబ్‌ సభ్యులతో నమ్మబలికారు.

వైద్య‌విద్య‌ను అభ్య‌సించాలంటే క‌శ్మీరీ యువ‌త ఇక పాకిస్థాన్‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని అమిత్‌షా పేర్కొన్నారు.  ఇంత‌కుముందు 500 మంది యువ‌కులు మాత్ర‌మే వైద్యుల‌య్యేవారు. ఇప్పుడు నూత‌న మెడిక‌ల్ కాలేజీలు వచ్చాక రెండువేల మంది యువ‌కులు వైద్యులు అవుతార‌ని పేర్కొన్నారు.

ఇదిలావుండగా, అమిత్ షా పుల్వామా జిల్లా, లేత్‌పొరలో ఉన్న సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) శిబిరాన్ని సోమవారం రాత్రి సందర్శించారు.  సైనికులతో కలిసి విందు ఆరగించి, అక్కడే బస చేశారు. 2019 ఫిబ్రవరి 14న లేత్‌పొరలో భద్రతా సిబ్బంది వాహనాలపై జరిగిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 40 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది అమరులయ్యారు.

చివరి రోజు పర్యటనలో భాగంగా అమిత్‌ షా సోమవారం ఉదయం గండెర్‌బాల్‌ జిల్లాలో ఉన్న ఖీర్‌ భవానీ ఆలయంలో పూజలు నిర్వహించారు. అలానే అమిత్‌ షా కశ్మీర్‌ ఫెరాన్‌ మాదిరి దుస్తులు ధరించి.. మాతా రంగ్యాదేవి ఆలయంలో పూజలు నిర్వహించారు. కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా అమిత్‌ షాతో పాటు ఆలయాన్ని సందర్శించారు. 

అఫ్గాన్‌ తాలిబన్ల వశమైన నేపథ్యంలో కశ్మీర్‌లో మళ్ళీ హింస పేట్రేగడం గమనార్హం. కాబూల్‌ను కైవసం చేసుకున్న తాలిబన్లు తమకు కశ్మీర్‌ను కట్టబెట్టడంలో సాయపడతారన్న పాకిస్తానీ మంత్రి మాటనూ మర్చిపోలేం. అందుకే, పర్యటన సమయాన్ని పొడిగించుకొని, సోమవారం రాత్రి కూడా అక్కడే గడిపి, కశ్మీర్‌పై సీరియస్‌గా ఉన్నామన్న సంకేతాలిచ్చారు అమిత్ షా.