వ్యాక్సిన్ తయారీదారులు ప్రధానికి ధన్యవాదాలు

రికార్డు సమయంలో వ్యాక్సిన్లను సిద్ధం చేయడానికి, వాటిని ల్యాబొరేటరీల నుంచి ప్రజలకు చేరువ చేయడానికి నిరంతరం సహకరించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యాక్సిన్ తయారీదారులు ధన్యవాదాలు తెలిపారు. 

ఏడు భారతీయ కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీ సంస్థల ప్రతినిధులతో మోదీ శనివారం సమావేశమయ్యారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్, జైడస్ క్యాడిల్లా, బయోలాజికల్ ఇ, జెనోవా బయో ఫార్మా, పానాసియా బయోటెక్ సంస్థల ప్రతినిధులలు ఈ భేటీలో పాల్గొన్నారు.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, ఆ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వ్యాక్సిన్ పరిశోధనను ముమ్మరం చేయడంతో సహా పలు అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. దేశంలో టీకా పంపిణీ వంద కోట్ల మైలురాయిని దాటిన రెండు రోజుల తర్వాత ఈ సమావేశం జరగడం గమనార్హం.

సీరం ఇన్‌స్టిట్యూట్‌ మేనేజింగ్ డైరెక్టర్ సైరస్ పూనావాలా ఈ సమావేశం అనంతరం మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశిత పరిధికి మించి పని చేశారని చెప్పారు. ప్రతి ఒక్కరూ వేగంగా పని చేసేలా ప్రధాని ప్రోత్సహించారని చెప్పారు. ఆయన, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కృషి చేసి ఉండకపోతే, నేడు మన దేశం 100 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసుల పంపిణీ రికార్డును సాధించి ఉండేది కాదని స్పష్టం చేశారు.

జైడస్ క్యాడిలా సీఎండీ పంకజ్ పటేల్ మాట్లాడుతూ, తమ డీఎన్ఏ వ్యాక్సిన్‌ను తమ శాస్త్రవేత్తల కృషితో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దీనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహకారం చాలా ఉందని చెప్పారు. ఆయన మొదటి నుంచీ తమను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.

 ‘‘ముందడుగు వేయండి, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’’ అని చెప్పారని తెలిపారు. ఐక్య రాజ్య సమితిలో తమ వ్యాక్సిన్ గురించి మోదీ మాట్లాడారని, ఇది తమకు ఎంతో గర్వకారణమని చెప్పారు. ఈ సరికొత్త నవ కల్పన (ఇన్నోవేషన్) అధ్యాయంలో భారత దేశం వేగంగా ప్రగతి సాధిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

ప్రస్తుతం దేశంలో సీరమ్ సంస్థ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్, హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌తో పాటుగా స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. 

ఇక జైడస్ క్యాడిల్లా రూపొందించిన జైకోవ్‌డి వ్యాక్సిన్‌కు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. మరోవైపు బయోలాజికల్‌ఇ సంస్థ అభివృద్ధి చేసిన కార్బివాక్స్ టీకాకు అనుమతులు మంజూరు చేయనప్పటికీ ఇప్పటికే 30 కోట్ల డోసులకు ఆ సంస్థతో ఒప్పందం చేసుకుంది.