యుపిలో మరోమారు ఎస్పీ, కాంగ్రెస్ పొత్తు ప్రయోగం!

2017 ఎన్నికలలో వికటించిన ఎన్నికల పొత్తు ప్రయోగాన్ని మరోమారు ప్రయోగించేందుకు ఉత్తర ప్రదేశ్ లో సమాజవాద్ పార్టీ, కాంగ్రెస్ సిద్ధపడుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. 
 
కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి  ప్రియాంకగాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత  అఖిలేష్ యాదవ్‌లు శుక్రవారం రాత్రి ఒకే విమానంలో ప్రయాణిస్తూ, ఇద్దరు  యాదృచ్చికంగా   కలసి, ఒకరినొకరు పలకరించుకోవడం ఈ దిశలో మొదటి అడుగుగా పలువురు భావిస్తున్నారు. 2017 ఎన్నికలలో పొత్తు పెట్టుకొని, విఫలమైన తర్వాత రెండు పార్టీల అగ్రనేతలు కలుసుకోవడం ఇదే ప్రధమం కావడం గమనార్హం. 
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై ప్రతికూలతను పోగుచేసి, సంవత్సరంకు పైగా రాష్ట్ర సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలను ఆసరాగా చేసుకొని తిరిగి అధికారంలోకి రావాలని ఎస్పీ  అధినేత అఖిలేష్ యాదవ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపించడం లేదు. 
మరోవంక ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టి, స్వయంగా పోటీకి సిద్ధం అనే సంకేతాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జాతీయ మీడియాలో లభిస్తున్న ప్రచారం ప్రభావం క్షేత్ర స్థాయిలో కనిపించక పోవడంతో కలత చెందుతున్నారు. 
 
ముఖ్యంగా నేరాలను కట్టడి చేయడం, పెట్టుబడులను విశేషంగా ఆకర్షించడం ద్వారా రాష్ట్ర స్వరూపంలో కొంత మార్పు తీసుకు రాగలిగిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తిరిగి గెలుపొందడం ఖాయం అంటూ ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేశాయి. పైగా ప్రజాకర్షణలో ఆయనతో పోటీపడగల నాయకులు రాష్ట్రంలో మరెవ్వరు లేరని కూడా వెల్లడి అవుతున్నది. 
 
యూపీలోని  ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ పార్టీలతో పొత్తు ప్రసక్తి లేదని ఇప్పటికే ప్రకటించాయి. దానితో కాంగ్రెస్ ఒంటరిగా రెండంకెల సీట్లు అయినా గెల్చుకోగలదా అనే ప్రశ్న ఎదురవుతుంది. కాంగ్రెస్ తో మొన్నటివరకు సన్నిహితంగా వ్యవహరించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహితం కాంగ్రెస్ అవకాశాలపై పెదవి విరిచారు. 
యుపిలో అధికారంలోకి వస్తామని ఆశలు లేకపోయినా, గౌరవనీయమైన సీట్లు అయినా గెల్చుకోలేని పక్షంలో కాంగ్రెస్ పార్టీపై తమ కుటుంభం పట్టు కోల్పోవలసి వస్తుందని ప్రియాంక ప్రధానంగా ఆందోళన చెందుతున్నారు. గత లోక్ సభ ఎన్నికలలో తమ కుటుంబానికి కంచుకోట అనుకున్న నియోజకవర్గంలో రాహుల్ గాంధీ ఓటమి చెందడంతో, ఆ తర్వాత ఆయన యుపి వైపు చూడడానికి విముఖంగా ఉంటున్నారు. 
 
త్రిముఖ పోటీలో ఓట్లు చీలి, తాము అధికారంలోకి రాగలమని అఖిలేష్ అంచనా వేసుకొంటూ వస్తున్నారు. అయితే బీఎస్పీ పునాదులే కూలిపోతూ ఉండడంతో బిజెపిని ఎదుర్కోవడం కష్టంగా భావిస్తున్నారు. అందుకనే కాంగ్రెస్ తో పొత్తు ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక లేకుండా చూడవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలుస్తున్నది
 
‘‘కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ల మధ్య ఢిల్లీ నుంచి లక్నో వెళ్లే విమానంలో ప్రణాళిక లేని మర్యాదపూర్వక సమావేశం జరిగింది. ఈ సమావేశం యాదృచ్ఛికంగా జరిగిందని, ఇద్దరి మధ్య ఎటువంటి రాజకీయ చర్చ జరగలేదు’’అని సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. తమ రెండు పార్టీల మధ్య పొత్తుకు అవకాశం లేదనే సంకేతం ఇవ్వడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తున్నది. 
 
2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యూపీ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల వాగ్ధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రియాంకగాంధీ ప్రతిజ్ఞ యాత్రలను శనివారం ప్రారంభించేందుకు ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి వచ్చారు. మరోవైపు అఖిలేష్ యాదవ్ తన ఢిల్లీ పర్యటనను ముగించుకొని లక్నోకు తిరిగి వస్తూ ఒకే విమానంలో ప్రయాణించారు.
 
విమానంలో తీసిన ఫొటోలో అఖిలేష్ ధరించిన మాస్కు వెనుక నుంచి నవ్వుతూ ప్రియాంకాగాంధీతో పలకరించుకోవడం కనిపించింది. అయితే విమానంలో కలసినప్పుడు “తిరిగి ఇద్దరం త్వరలో కలుద్దాం” అంటూ ఇద్దరు అనుకోవడం గమనిస్తే వారిద్దరూ ఉమ్మడగా రాజకీయ వ్యూహం ఏర్పర్చుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం అవుతుంది.