శ్రీనగర్ లో అమిత్ షా మృతుల కుటుంబాల పరామర్శ 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం ఉదయం జమ్మూ కాశ్మీర్‌కి వచ్చారు. రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత ఆయన ఈ సరిహద్దు ప్రాంతంకు రావడం ఇదే మొదటిసారి.

గత నెలలో ఉగ్రవాదుల చేతిలో హతమైన దివంగత ఇన్‌స్పెక్టర్ పర్వేజ్ అహ్మద్ ఇంటిని సందర్శించడం ద్వారా హోంమంత్రి తన పర్యటనను ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన కాగితాలను భార్యకు అందించాడు. షా పర్యటనలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, డిజిపి దిల్‌బాగ్ సింగ్ ఉన్నారు.

శ్రీనగర్ విమానాశ్రయంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మరియు జమ్మూ కాశ్మీర్ పరిపాలనలోని ఇతర సీనియర్ అధికారులు ఆయనకు స్వాగతం. లోయలో వరుస పౌర హత్యల నేపథ్యంలో షా పర్యటన జరగడం ప్రాధాన్యత సంతరింప చేసుకొంది. భద్రతా పర అంశాలపై రాజ్ భవన్‌లో ఏకీకృత కమాండ్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి నలుగురు కార్ప్స్ కమాండర్లు, రాష్ట్ర  పోలీసు ఉన్నతాధికారులు, ఇంటెలిజెన్స్ బ్యూరో, కేంద్ర సాయుధ పోలీసు దళాల అధిపతులు హాజరవుతారు.


ఇటీవల ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురయిన సిక్కు మత బోధకుడు,  ముస్లిం పౌరుడైన మఖన్ లాల్ బింద్రూ కుటుంబాలను సందర్శించే కూడా కేంద్ర మంత్రి అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 
షా దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని లెత్‌పోరాను సందర్శించి, 2019 ఫిబ్రవరిలో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన 40 మంది సిఆర్‌పిఎఫ్ అమరవీరులకు నివాళులర్పించే అవకాశం ఉంది. 

షా ఆదివారం జమ్మూకు వెళ్లనున్నారు. ఆయన అక్కడ ఉదయం ఐఐటీ స్నాతకోత్సవంలో ప్రసంగించి, మధ్యాహ్నం బహిరంగ ర్యాలీలో ప్రసంగించే అవకాశం ఉంది.  శ్రీనగర్‌కు తిరిగి వెళ్లే ముందు కాశ్మీరీ పండిట్ల ప్రతినిధి బృందాన్ని కూడా కలిసే అవకాశం ఉంది. 
సోమవారం సర్పంచ్‌లతో సంభాషించనున్నట్లు తెలుస్తోంది.

గత రెండు వారాల్లో, వలసదారులు, ముస్లిమేతర కాశ్మీరీలతో సహా 11 మంది పౌరులు మిలిటెంట్ల చేతిలో హతమయ్యారు. భద్రతా బలగాలు ఈ కాలంలో 17 మంది అనుమానిత ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
 
షార్జాకు విమానం ప్రారంభం 
 
శ్రీనగర్ నుండి ఇప్పుడు నేరుగా అంతర్జాతీయ విమానాలు నడవడం ప్రారంభమైనది. శ్రీనగర్ నుంచి షార్జాకు నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం ప్రారంభించారు. 
శ్రీనగర్ విమానాశ్రయం టెర్మినల్ 25000 చదరపు మీటర్ల నుంచి 63000చదరపు మీటర్లకు విస్తరించడంతోపాటు కేంద్రపాలిత ప్రాంతం అభివృద్ధికి ఊతం ఇచ్చేందుకు శ్రీనగర్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించినట్లు కేంద్రపౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.

 అంతర్జాతీయ విమాన ప్రయాణికుల కోసం శ్రీనగర్ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని కేంద్ర మంత్రి అధికారులను ఆదేశించారు. అమిత్ షా పర్యటన సందర్భంగా కశ్మీర్ లోయలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.  ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే సైతం ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.