ఫామ్ హౌస్ పాలన కావాలా? సంక్షేమ పాలన కావాలా?

మనకు ఫామ్ హౌస్ పాలన కావాలా? సంక్షేమ పాలన కావాలా? ఒకసారి ఆలోచించండి అని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హుజూరాబాద్‌  ప్రజలను కోరారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటలో మాజీమంత్రి, బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ తో కలిసి ప్రచారం చేస్తూ సీఎం కేసీఆర్  గత ఏడేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 
 
తెలంగాణ ఆత్మ గౌరవానికి, కేసీఆర్ అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నిక హుజురాబాద్ అని చెబుతూ కేవలం డబ్బును మాత్రమే నమ్ముకుని కేసీఆర్ ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు. సీఎం కుర్చీ తనకు ఎడమకాలి చెప్పుతో సమానమని గతంలో చెప్పిన కేసీఆర్ కు ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. అబద్ధం ముందు పుట్టి కేసీఆర్ తర్వాత పుట్టాడని విమర్శించారు.

హుజురాబాద్ లో ఈటల రాజేందర్ ను ఓడించడానికి కేసీఆర్ వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని ధ్వజమెత్తారు.  ఇంతటి అధికార దుర్వినియోగాన్ని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అని… అలాంటి పార్టీతో బీజేపీకి పొత్తు ఎప్పుడూ ఉండదని ఆయన స్పష్టం చేశారు. 

దళితబంధు ఆపేయించారని తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలైన తెల్లారి అందరికీ దళితబంధు ఇవ్వాలని ఆయన  సవాల్ చేశారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని అంతా భావిస్తున్నారని చెబుతూ ఈటల రాజేందర్. హుజురాబాద్ ఎన్నికతో కేసీఆర్ నిజస్వరూపం బయట పడుతుంది తెలిపారు. .

రాష్ట్రంలో జరిగే ప్రతి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.  కరోనా కారణంగా ప్రతి పేదింటికి ఉచితంగా బియ్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ధర్మం వైపు ఉన్న ఈటల రాజేందర్ ను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
 
దళిత బంధు పై కేసీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. దళితులకు ఇస్తామన్న 3 ఎకరాల భూమి హామీ ఏమైందని ప్రశ్నించారు. దళిత బంధు రావడానికి కారణం ఈటల రాజేందరే అని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి దళితునికి దళితబంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు ప్రజలు చరమ గీతం పాడాలంటే హుజురాబాద్ లో ఈటల రాజేందర్ ను గెలిపించాలని కిషన్ రెడ్డి పిలుపిచ్చారు. 

తెలంగాణ వచ్చాక బాగుపడింది ఒక్క సీఎం కుటుంబసభ్యులేనని మండిపడ్డారు. స్వరాష్ట్రం కోసం ఆత్మబలిదానాలు చేసిన కుటుంబాలు ఇప్పుడెక్కడ ఉన్నా యని ప్రశ్నించారు. కేవలం ఈటల మీద గెలిచేందుకే దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని, అందుకే ఈ పథకానికి ఈటల రాజేందర్‌ దళితబంధు అని పేరు పెట్టాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎన్నికలయ్యాక దళితబంధును అమలు చేయరని, దళితబంధు అమలు కావాలంటే ఈటల రాజేందర్‌ను గెలిపించాలని కిషన్‌రెడ్డి కోరారు.

ఈటల మాట్లాడుతూ తాను దళితబంధును ఆపేందుకు లేఖ రాశానని కేసీఆర్‌ తనపై నిందలు వేశారని పేర్కొన్నారు. కేసీఆర్‌కు సీఎం పదవి వారసత్వంగా వచ్చింది కాదని, ప్రజల ఓట్లతో వచ్చిన విషయాన్ని మరిచిపోవద్దని హితవు పలికారు. దళితబంధును తెలంగాణవ్యాప్తంగా అమలు చేయించడమే తన మొదటి యుద్ధమని, ఈ నెల 30 తర్వాత ఇక తనకు అదే పని అన్నారు. ఉపఎన్నికలో, 2023 ఎన్నికల్లో ఎగిరేది కాషాయ జెండానే అని ఈటల ధీమా వ్యక్తం చేశారు.