ఫైజాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఇక అయోధ్య కంటోన్మెంట్‌!

మొగల్‌సరాయ్‌ రైల్వేస్టేషన్‌ పేరును దీనదయాళ్‌ ఉపాధ్యాయ రైల్వేస్టేషన్‌గా  2018 నవంబర్ లో మార్చిన ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం.. తాను ఎంపీగా ఉన్న ఘోరక్‌పూర్‌లోని పలు ప్రాంతాల పేర్లను ముస్లింకు బదులుగా హిందు పేర్లను ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ తీసుకొచ్చారు.

 ఉత్తర ప్రదేశ్‌లోని ఫైజాబాద్ రైల్వే స్టేషన్ పేరును అయోధ్య కంటోన్మెంట్‌గా మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం (సీఎంఓ) శనివారం ట్వీట్ చేసింది. 2018 నవంబరులో ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మార్చిన సంగతి తెలిసిందే. అదేవిధంగా అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చారు. 

యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇటీవల ఝాన్సీ రైల్వే స్టేషన్ పేరును రాణీ లక్ష్మాబాయ్ రైల్వే స్టేషన్‌గా మార్చింది. ఇంకా చాలా ప్రాంతాల పేర్లు మార్చాల్సి ఉన్నదని, తాజ్‌మహల్‌ను రామ్‌మహల్‌గా కూడా మార్చాలన్న యోచన ఉన్నట్లు ఒక టీవీ ఛానల్‌ చర్చలో యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు. 

అదేవిధంగా రాజ్యంగంలోని ఆర్టిక్‌ 1 లో పేర్కొన్న ఇండియా అనే పదాన్ని హిందుస్థాన్‌గా మార్చేందుకు చట్టసవరణ తేవాలని కూడా యోగి కేంద్రానికి ప్రతిపాదనలు కూడా చేశారు. ఇప్పుడు ఫైజాబాద్‌ జంక్షన్‌ రైల్వే స్టేషన్‌పేరును అయోధ్య కంటోన్మెంట్‌గా మార్చనున్నారు. త్వరలో క్యాబినెట్‌ మీటింగ్‌లో చర్చించి పేరు మార్చే ఉత్తర్వులు ఇవ్వనున్నారని స్థానిక అధికారుల ద్వారా తెలిసింది.

డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ సంజయ్ త్రిపాఠితో ఫైజాబాద్ ఎంపీ లల్లూ సింగ్ మాట్లాడుతూ, తాను రైల్వే మంత్రితో కూడా ఈ విషయంపై చర్చించానని, ఫైజాబాద్ స్టేషన్‌ పేరును అయోధ్య కంటోన్మెంట్‌గా మార్చడంపై మాట్లాడానని పేర్కొన్నారు. ఫైజాబాద్, అయోధ్య రైల్వే స్టేషన్లతో పాటు అన్ని స్టేషన్ల సుందరీకరణ, రైల్వే లైన్ల డబ్లింగ్‌ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసి పర్యాటకంగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు.