అజారుద్దీన్‌ పాలన తీరుపై `సుప్రీం’ అసంతృప్తి

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) పరిపాలన వ్యవహారాలపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధ్యక్షుడు మహమ్మద్‌ అజారుద్దీన్‌ పాలన తీరుతో పాటు అంబుడ్స్‌మన్‌గా జస్టిస్‌ దీపక్‌వర్మ నియామకం విషయంలో జరిగిన రాద్ధాంతంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

అంబుడ్స్‌మన్‌గా దీపక్‌వర్మ నియామకంపై తెలంగాణ హైకోర్టు ఏప్రిల్‌ 6న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హెచ్‌సీఏతో పాటు బడ్డింగ్‌ స్టార్‌ క్రికెట్‌ క్లబ్‌ దాఖలు చేసిన వేర్వేరు పిటీషన్లను చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌ గురువారం విచారణకు స్వీకరించింది.

ఈ సందర్భంగా హెచ్‌సీఏలో గత కొన్నేండ్లుగా జరుగుతున్న పరిణామాలపై ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ‘హెచ్‌సీఏలో పరిస్థితి చూస్తుంటే..క్రికెట్‌ను పక్కకు పెట్టి రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తున్నది’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. 

జరుగుతున్న మొత్తం పరిణామాలపై సుప్రీం కోర్టు లేదా హైకోర్టు మాజీ జడ్జీ చేత పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తామని పేర్కొంటూ హెచ్‌సీఏ మేనేజ్‌మెంట్‌ నుంచి రెండు గ్రూపులు పూర్తిగా పక్కకు తప్పుకోవాలని స్పష్టం చేసింది. ఈ వివాదంలోకి న్యాయ వ్యవస్థను కూడా లాగాలనుకున్నారని మండిపడింది. దీనిపై అవసరమైతే సీబీఐ విచారణ కూడా అవసరం అని బెంచ్‌కు నేతృత్వం వహించిన జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే అంబుడ్స్‌మన్‌గా జస్టిస్‌ దీపక్‌వర్మ ఎలాంటి ఆదేశాలు జారీ చేయవద్దని జస్టిస్‌ సూర్యకాంత్‌, హిమా కోహ్లీతో కూడిన సుప్రీం బెంచ్‌ స్పష్టంగా సూచించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం..వర్మ స్థానంలో మాజీ జడ్జీల పేర్లను పరిశీలిస్తామని పేర్కొంది. అంబుడ్స్‌మన్‌గా జస్టిస్‌ దీపక్‌వర్మ నియామకంపై అధ్యక్షుడు అజర్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.