చైనా దాడి చేస్తే, తైవాన్‌కు అండ‌గా పోరాడుతాం

ఒక‌వేళ తైవాన్‌పై డ్రాగ‌న్ దేశం చైనా దాడి చేస్తే, అప్పుడు తైవాన్‌కు అండ‌గా పోరాడుతామ‌ని అమెరికా అధ్య‌క్షుడ బైడెన్ హెచ్చరించారు.  తైవాన్‌ను ర‌క్షిస్తారా అని ఓ విలేఖ‌రి అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న బ‌దులిస్తూ.. అవును తాము ఆ విష‌యానికి క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. తమ బలమేంటో చైనా, రష్యా సహా ప్రపంచం మొత్తానికి తెలుసని  పరోక్షంగా చైనాను హెచ్చరించారు.

తమ బలం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రపంచంలోనే తాము అత్యంత శక్తివంతమైన మిలిటరీ దేశమని ఆయన పేర్కొన్నారు. అయితే తైవాన్ అంశంలో త‌మ ప్ర‌భుత్వ విధానంలో ఎటువంటి మార్పులేద‌ని వైట్‌హౌజ్ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు. బైడెన్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కూడా తైవాన్ స్పందించింది. చైనా అంశంలో త‌మ విధానం ఏమీ మార‌ద‌ని, ఒక‌వేళ డ్రాగ‌న్ దేశం దాడి చేస్తే, తామే ప్ర‌తిదాడి ఇస్తామ‌ని తైవాన్ పేర్కొన్న‌ది.

చాన్నాళ్ల నుంచి తైవాన్ అంశంలో అమెరికా వ్యూహాత్మ‌క మౌనాన్ని పాటించింది. అయితే తాజాగా బైడెన్ చేసిన కామెంట్ కొంత ఆస‌క్తిని రేపింది. తైవాన్ త‌మ దేశానికి చెందిన భూభాగం అని చైనా భావిస్తున్న విష‌యం తెలిసిందే. ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకోవాల‌ని డ్రాగ‌న్ దేశం ఆలోచిస్తున్న‌ది. కానీ తైవాన్ మాత్రం త‌న‌కు తాను స్వ‌తంత్య్ర దేశంగా ప్ర‌క‌టించుకున్న‌ది. తైవాన్‌తో అమెరికాకు నేరుగా దౌత్య‌ప‌ర‌మైన సంబంధాలు లేవు. కానీ ఆ దేశానికి ఆయుధాల‌ను అమెరికా అమ్ముతోంది.

 కాగా, తైవాన్‌ను విలీనం చేసుకుంటామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఇటీవల పునరుద్ఘాటించారు. ‘శాంతియుత విలీనం’ జరుగుతుందని వ్యాఖ్యానించారు. చైనా, తైవాన్‌ మధ్య ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తైవాన్ ఏకీక‌ర‌ణ‌ను శాంతియుతంగానే సాధించాల‌ని, వేర్పాటువాదాన్ని వ్య‌తిరేకించే వైభ‌వ సాంప్ర‌దాయం చైనా ప్ర‌జ‌ల‌కు ఉన్న‌ట్లు ఆయ‌న ప‌రోక్ష  హెచ్చరిక  కూడా చేశారు. 

ఇక ఏకీక‌ర‌ణ కోసం తైవాన్‌పై ద‌ళాల‌ను కూడా వినియోగించేందుకు వెనుకాడేదిలేద‌ని ఇటీవ‌ల చైనా స్ప‌ష్టం చేసింది. సుమారు 150 చైనా యుద్ధ విమానాలు ఇటీవ‌ల తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్‌లోకి ప్ర‌వేశించిన విష‌యం తెలిసిందే. దీంతో తైవాన్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. 2025 నాటికి త‌మ దేశాన్ని చైనా ఆక్ర‌మించేస్తుంద‌ని తైవాన్ అభిప్రాయ‌ప‌డింది.