బంగ్లాలో హిందూవులపై పధకం ప్రకారమే దాడులు 

బంగ్లాదేశ్‌లో హిందువులపై విధ్వంసకాండ అంతులేకుండా సాగుతోంది. సోమవారం జరిగిన వివిధ ఘటనలలో 66 ఇళ్లను అల్లరిమూకలు ధ్వంసం చేశాయి. హిందువులకు చెందిన కనీసం 20 ఇళ్లను తగులబెట్టారు. విజయదశమి సందర్భంగా దుర్గామాతా మందిరాలపై దాడుల నాటి నుంచి వరుసగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 

ఓ వైపు సామాజిక మాధ్యమాలలో మతపర విద్వేషకర వ్యాఖ్యానాలు, మరో వైపు మైనార్టీ వర్గాల నిరసనల నడుమనే ఇళ్ల విధ్వంసాలు పెరిగాయి. పలు ప్రాంతాలలో దోపీడీలు దొమ్మిలు చోటుచేసుకున్నాయి. మహజీపురాలో ఓ మత్సకారుల వాడలోకి చొరబడి అల్లరిమూకలు పలు ఇళ్లను తగులబెట్టినట్లు, వెంటనే అక్కడి భద్రతా బలగాలు చేరుకున్నట్లు వార్తా సంస్థలు తెలిపాయి.

బాంగ్లాదేశ్ లో కొన్ని స్వార్థపర శక్తులు మైనారిటీ హిందువులపై ముందుగా వేసుకున్న ఒక పధకం ప్రకారమే దాడులు జరిపి, అల్లర్లు సృష్టించారని ఆ దేశపు హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  “కేవలం కామిల్లలో మాత్రమే కాకుండా రాము, నాసిర్‌నగర్‌లో జరిగిన మతపరమైన హింస ద్వారా దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు జరిగాయి. వాటన్నింటినీ మేము తగు ఆధారాలతో బహిరంగపరుస్తాము. ఇందులో పాల్గొన్న వారికి కఠినమైన శిక్ష పడేటట్లు చూస్తాము” అని ఆయన స్పష్టం చేశారు.

గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌లో అనేక దేవాలయాలు, దుర్గా పూజ పండళ్లపై దాడి జరిగింది, ఇది పొరుగు దేశంలో ఘర్షణలు, ఉద్రిక్తతలకు దారితీసింది. హింసాకాండలో కనీసం నలుగురు మరణించినట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఈ వారం ప్రారంభంలో, “మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు” ప్రయత్నించిన వారిపై మళ్లీ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేరస్థులపై వేటు వేసి శిక్షిస్తామని ఆమె స్పష్టం చేశారు. 

ఈ పరిస్థితులపై పొరుగున ఉన్న ప్రభుత్వం పరిస్థితులను అదుపులోకి తీసుకు రావడానికి సత్వరమే స్పందించిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది.  ఈ విషయంపై భారత మిషన్ బంగ్లాదేశ్ అధికారులతో సన్నిహితంగా ఉందని చెప్పారు. ఇస్కాన్ కోల్‌కతా సభ్యులు ఆదివారం బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషన్ వెలుపల ప్రదర్శించారు, రెండు రోజుల క్రితం పొరుగు దేశంలోని తమ  ఆలయంపై దాడి చేసిన దుర్మార్గులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దాడిలో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు.

నిరసనకారులు, సుమారు 100 మంది, క్యాండిల్‌లైట్ మార్చ్ చేపట్టారు, ‘ఖోల్ కర్తల్’ తో పాటు కీర్తనలు పాడారు.  బెక్‌బగన్ ప్రాంతంలోని కార్యాలయం ముందు ‘హరే కృష్ణ’ అని నినాదాలు చేశారు. బంగ్లాదేశ్‌లోని హిందువులకు రక్షణ కల్పించాలని కోరుతూ వారిలో చాలామంది పోస్టర్లు చేతిలో పట్టుకున్నారు.

“మేము చాలా బాధపడుతున్నాము. మేము శాంతి, సోదరభావాన్ని పెంపొందిస్తాము. ఒక గుంపు మమ్మల్ని ఎలా లక్ష్యంగా చేసుకోగలదు? మేము అన్ని సంవత్సరాలలో నోఖాలి [బంగ్లాదేశ్‌లో] ప్రజల పక్షాన ఉన్నాము” అని ఇస్కాన్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు రాధారమన్ పేర్కొన్నారు.

కాగా, బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు తీవ్రమయ్యాయని, హిందూ గ్రామాలు తగలబడుతున్నాయని రచయిత తస్లీమా నస్రీమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంటల్లో బూడిదవుతున్న గ్రామానికి సంబంధించిన ఒక ఫొటోను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఆమె  దేశంలో ఇంతటి సంక్షోభం కొనసాగుతోంటే ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా ఫ్లూట్ వాయిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

‘‘బంగ్లాదేశ్‌లోని పిర్గంజ్, రంగాపూర్ జిల్లాల్లో ఉన్న రెండు హిందూ గ్రామాలు రాత్రి అగ్రికి ఆహుతయ్యాయి. కానీ హసీనా ఫ్లూట్ వాయిస్తూ ఉన్నారు’’ అని ఆమె ట్వీట్ చేశారు.