జో బైడెన్‌కు తగ్గిపోతున్న ప్రజాదరణ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు పదవి చేపట్టిన 10 నెలలలోపే  ప్రజాదరణ తగ్గిపోతున్నట్లు కనిపిస్తున్నది. ఇది దేశాధ్యక్షుడు లేదా అతడి ప్రభుత్వం గురించి సాధారణ ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారనేది స్పష్టం చేస్తుంది. 

అక్టోబర్ 6 న కునిపియాక్ యూనివర్సిటీ అధ్యయనకారులు విడుదల చేసిన సర్వే ఫలితాల ప్రకారం, జో బైడెన్‌ ప్రజాదరణ‌ రేటింగ్‌ చాలా తక్కువగా ఉన్నది. ప్రజల్లో ఆయనకు 38 శాతం ఆదరణ ఉండగా, ప్రజావ్యతిరేకత రేటింగ్‌ మాత్రం 53 శాతంగా నమోదైంది. 

సెప్టెంబర్‌ నెలలో ప్రజాదరణ 42 శాతం, ప్రజావ్యతిరేకత 50 శాతంగా వచ్చాయి. ఈ రేటింగ్‌ను బట్టి బైడెన్‌ పట్ల ప్రజల ఆదరణ వేగంగా పడిపోతున్నదని అర్ధమవుతున్నది. దీనికి ప్రధాన కారణాలేంటని అమెరికన్ మీడియా ప్రశ్నలు లేవనెత్తుతున్నది.

జనవరి 20 న అధ్యక్షుడిగా వైట్ హౌస్‌లోకి బైడెన్‌ ప్రవేశించి 9 నెలలు గడిచిపోతున్నాయి. కానీ, ఇంతవరకు బైడెన్‌కు ప్రజామోదం రేటింగ్ 50 శాతానికి మించలేదు. బైడెన్‌ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు చాలా వరకు ప్రశ్నిస్తున్నారు.

అధిక పన్ను వసూలు, కొవిడ్ నియంత్రణ, ఆఫ్ఘనిస్తాన్ సమస్యలపై బైడెన్‌పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. దాదాపు ప్రతి సమస్యపై మాజీ అధ్యక్షుడు ఒబామాతో బైడెన్‌ సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వృత్తిపరమైన, వ్యక్తిగత విషయాలపై ఒబామాతో క్రమం తప్పకుండా బైడెన్‌ మాట్లాడుతారని వైట్‌హౌస్‌ తెలిపింది.

ముఖ్యంగా ఆఫ్ఘానిస్తాన్ నుండి అమెరికా సేనలు వైదొలిగిన విధానం, తాలిబన్లతో చేసుకున్న ఒప్పందం అమలు కాకపోవడం ఆయన ప్రభుత్వం పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తుంది.