కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో పటేల్ కు అవమానం

 
మూడు రోజుల క్రితం జరిగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో మాజీ ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌పై కశ్మీర్‌కు చెందిన కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచినా పటేల్ కు అవమానం చేసారంటూ మండిపడింది. 
 
జమ్మూ కశ్మీర్‌ను భారత్‌ నుంచి వేరు చేయాలని పటేల్ భావించారని అయితే జవహార్‌లాల్ నెహ్రూ చొరవతో కశ్మీర్‌లో భారత్‌లో భాగంగా ఉండిపోయిందని కశ్మీర్‌కు చెందిన కాంగ్రెస్ నేత తారిఖ్ హమీద్ కర్ర వ్యాఖ్యానించినట్లు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. గాంధీ కుటుంబం కారణంగా సర్దార్ పటేల్‌కు అప్పట్లో అవమానం జరిగిందని, ప్రస్తుతం కూడా అది కొనసాగుతూనే ఉందని పాత్రా ధ్వజమెత్తారు. 

‘‘భారత్ నుంచి జమ్మూ కశ్మీర్‌ను ప్రత్యేకంగా ఉంచాలని సర్దార్ పటేల్ భావించినట్లు తారిఖ్ హమీద్ అన్నారు. అయితే జవహార్‌లాల్ నెహ్రూ మాత్రం కశ్మీర్‌ను భారత్‌లో ఉండాలని కోరుకున్నారు. దాని కోసం మహ్మద్ అలీ జిన్నా సహాయం తీసుకుని, కశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగంగా ఉంచారని హమీద్ అన్నారు” అని ఆయన పేర్కొన్నారు. 

సీడబ్ల్యూసీ మీటింగ్‌లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పత్రికల్లో కూడా వచినా సోనియా గాంధీ దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? పటేల్‌పై ఇంత అవమానం జరిగినా గాంధీ కుటుంబానికి పట్టదా? గాంధీ కుటుంబం కాకుండా ఇంకెవరిపై విమర్శలు చేసినా కాంగ్రెస్‌కు పట్టింపు లేదా? అని సంబిత్ పాత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు.