వందేమాతరం పాడరాదంటూ ముస్లింలకు ఫత్వా

వందేమాతరం పాడరాదంటూ ఉత్తరప్రదేశ్‌లోని ముస్లింలకు ఇస్లామిక్ సంస్థ జమైత్ ఉలేమా-ఇ-హింద్ ఫత్వా జారీ చేసింది. దేవ్‌బండ్‌లో జరిగిన జమైత్ 30వ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం ఆమోదించారు. 

వందేమాతరంలోని కొన్ని పదాలు ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆ తీర్మానం పేర్కొంది. ఈ సదస్సుకు సుమారు 10,000 మంది మతపెద్దలు, ఇస్లామిక్ మేథావులు హాజరయ్యారు. జమైత్ ఇటీవల మదరసా విద్యా వ్యవస్థలో మార్పులతో సహా, మైనారిటీల వ్యవహారాలపై జోక్యం చేసుకోరాదని ప్రభుత్వాన్ని కోరుతూ కూడా తీర్మానాలు చేసింది.

కాగా, వందేమాతరం పాడరాదంటూ జమైతే సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ముస్లిం లా బోర్డు సమర్ధించింది. ముస్లింలు అల్లాకు మినహా ఏ ఒక్కరికీ ప్రార్థనలు చేయరని పేర్కొంది. ‘మేము దేశాన్ని ప్రేమిస్తాం. కానీ ఆరాధనలు చేయం’ అని బోర్డు సభ్యుడు కమల్ ఫరూఖి స్పష్టం చేశారు.

స్వాతంత్రం సిద్ధించడానికి ముందు నుంచే వందేమాతరం చుట్టూ ముస్లింలు వివాదం సృష్టిస్తూ వస్తున్నారు. 1937లో ఈ గీతం హోదా (స్టాటస్)పై భారత జాతీయ కాంగ్రెస్ సుదీర్ఘంగా చర్చించింది. గీతంలోని రెండు చరణాలు దుర్గామాతను స్తుతిస్తూ ఉండటంతో వాటిని గీతం నుంచి తప్పించాలని నిర్ణయించారు. ముస్లింల అభ్యంతరాలతో రాజ్యాంగ సభ వందేమాతరంను జాతీయ గీతంగా స్వీకరించలేదు. ఆ హోదాను ‘జనగణమన’కు కల్పించారు.