కేరళకు అన్ని విధాలుగా సాయం.. అమిత్ షా భరోసా 

భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళకు సాధ్యమైన అన్ని విధాలుగా సాయం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. రాష్ట్ర దక్షిణ, మధ్య ప్రాంతాల్లో కురిసిన వర్షాలు సృష్టించిన పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు. సహాయ కార్యక్రమాల కోసం ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపించామన్నారు. 

అమిత్ షా ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఏర్పడిన పరిస్థితులను తాము నిరంతరం పరిశీలిస్తున్నామని చెప్పారు. అవసరంలో ఉన్న ప్రజలకు సాధ్యమైన అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం సాయపడుతుందని తెలిపారు. 

సహాయ కార్యక్రమాల్లో సాయపడేందుకు ఎన్‌డీఆర్ఎఫ్ (జాతీయ విపత్తు స్పందన దళం) సిబ్బందిని ఇప్పటికే పంపించామని చెప్పారు. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. 

కేరళ వర్ష బీభత్సానికి చిగురుటాకులా వణికిపోతోంది. కూట్టిక్కల్, కొట్టాయం జిల్లాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో శిథిలాల నుంచి మరికొన్ని మృతదేహాలు ఆదివారం వెలిగి తీశారు. దీంతో ఇంతవరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 21కి చేరింది.

కొట్టాయంలో 13, ఇడుక్కిలో 8 మంది మృతి చెందినట్టు రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ తెలిపింది. భారత వైమానిక, సైనిక, ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసు బలగాలు, అగ్నిమాపక సిబ్బంది సహా స్థానికులు సహాయక చర్చలు ముమ్మరం చేశారు. కొట్టిక్కల్, కొక్కయార్ పంచాయతీల పరిధిలో డజను మందికి పైగా జాడ గల్లంతైనట్టు చెబుతున్నారు. 

కాగా, రాష్ట్రంలోని 6 జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరో 6 జిల్లాల్లో ఆరెంజ్ అలరెట్, రెండు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలతో అతలాకతులమైన ప్రాంతాల్లోని టూరిస్టు కేంద్రాలను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ మూసివేయాలని, బోటింగ్ సర్వీసును కూడా సస్పెండ్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు

అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్  విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌జ‌లు ఎప్పటిక‌ప్పుడు అన్ని ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. అదేవిధంగా వ‌ర్షాల కార‌ణంగా ఆశ్ర‌యం కోల్పోయిన వారి కోసం రాష్ట్ర‌వ్యాప్తంగా 105 పున‌రావాస కేంద్రాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు విజ‌య‌న్ తెలిపారు.