కరోనాపై భారత్ స్పందనను కొనియాడిన ఐఎంఎఫ్

కరోనా పరిస్థితులపై భారత ప్రభుత్వం వేగంగా, చెప్పుకోదగ్గ రీతిలో స్పందించిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రశంసించింది.  మహమ్మారి సమయంలో సైతం కార్మిక సంస్కరణలు, ప్రైవేటీకరణను కొనసాగించిందని ఆర్టికల్ 4 కన్సల్టేషన్స్ నివేదికలో తెలిపింది. అయితే ఆర్థిక పరిస్థితులు ఇంకా అస్పష్టంగానే ఉన్నట్లు పేర్కొంది. 

పెట్టుబడులు, ఇతర వృద్ధి కారకాలపై కరోనా ప్రతికూల ప్రభావం నిలకడగా కొనసాగుతోందని, ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం మరింత ఆలస్యం కావచ్చునని తెలిపింది. కరోనా మహమ్మారి పరిస్థితులను భారత ప్రభుత్వం దీటుగా, వేగంగా ఎదుర్కొందని తెలిపింది.

ప్రజలకు ఆర్థిక మద్దతును అందజేసిందని, అవసరంలో ఉన్న బలహీన వర్గాలకు సాయం చేసిందని, ద్రవ్య విధానాన్ని సులభతరం చేసిందని పేర్కొంది. లిక్విడిటీ ప్రావిజన్‌ను పెంచిందని, నియంత్రణ విధానాలను పటిష్టపరిచిందని పేర్కొంది. 

మహమ్మారి సమయంలో సైతం వ్యవస్థాగత సంస్కరణలు, కార్మిక సంస్కరణలు, ప్రైవేటీకరణ ప్రణాళికలను కొనసాగించిందని కొనియాడింది. భారత దేశ ఆర్థిక వ్యవస్థ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం వృద్ధి చెందుతుందని, 2022-23లో 8.5 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.

మహమ్మారి సంబంధిత అనిశ్చిత పరిస్థితుల వల్ల లాభాలు, నష్టాలకు సంబంధించిన రిస్క్‌లు ఉండటంతో ఆర్థిక పరిస్థితులు ఇంకా అస్పష్టంగానే కనిపిస్తున్నట్లు తెలిపింది. పెట్టుబడులు, హ్యూమన్ కేపిటల్, ఇతర వృద్ధి కారకాలపై కోవిడ్ ప్రతికూల ప్రభావం ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడాన్ని ఆలస్యం చేయవచ్చునని తెలిపింది. 

దీని ప్రభావం మధ్య కాలిక వృద్ధిపై పడుతుందని పేర్కొంది. ప్రభుత్వం ప్రకటించిన విస్తృత స్థాయి స్ట్రక్చరల్ రిఫామ్స్‌ను విజయవంతంగా అమలు చేస్తే, భారత దేశ వృద్ధి సామర్థ్యం పెరుగుతుందని తెలిపింది.