ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక శక్తిగా భారత్ 

భారత దేశాన్ని స్వంతంగా ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక శక్తిగా మార్చడమే లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 41 ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను 7 ప్రభుత్వ ఆధీనంలో కార్పొరేట్‌ సంస్థలుగా మార్చనున్నట్లు ఆయన వెల్లడించారు.  దేశ స్వావలంబన, రక్షణ సంసిద్ధతను మెరుగు పర్చేందుకు ఇది అతిపెద్ద చర్యగా ఆయన  అభివర్ణించారు. 

శుక్రవారం ఏడు కొత్త రక్షణ కంపెనీలను ప్రారంభించిన ఆయన  స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి సారిగా, భారత దేశ రక్షణ రంగంలో అనేక పెద్ద సంస్కరణలు చోటుచేసుకున్నాయని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంత పారదర్శకత, విశ్వాసం నేడు కలిగి ఉందని చెప్పారు. అనంతరం ఏడు ప్రభుత్వ రంగ సంస్థలను దేశానికి అంకితం చేశారు. 

 ఈ కొత్త కంపెనీలు పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని సూచించారు. భవిష్యత్ టెక్నాలజీలో కొత్త కంపెనీలు ముందు ఉండాలని కోరారు. స్వదేశీ శక్తిపై భారత రక్షణ రంగం అభివృద్ది చెందేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

రక్షణ పరికరాల ప్రధాన ఉత్పత్తిదారుగా భారత దేశాన్ని అభివృద్ధి చేయడానికి స్తబ్ధమైన విధానాలకు బదులుగా.. సింగిల్‌ విండో వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ప్రధాని చెప్పారు. ‘ స్వాలంబన ప్రచారంతో భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తిగా, ఆధునిక సైనిక పరిశ్రమ అభివృద్ధిని చేయడమే లక్ష్యం’ అని మోదీ స్పష్టం చేశారు. 

‘ఆత్మనిర్భర భారత్’ కార్యక్రమంలో భాగంగా మన దేశాన్ని సొంత శక్తితో ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక శక్తిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మన దేశంలోని రక్షణ రంగ పరిశ్రమలు అధునాతనంగా తయారవ్వాలని చెప్పారు. మన లక్ష్యం కేవలం ఇతర దేశాలతో సమానం కావడం మాత్రమే కాదని, ప్రపంచ దేశాలను లీడ్ చేసే స్థాయికి ఎదగాలని ప్రధాని అభిలాష వ్యక్తం చేశారు. 

గత ఏడేళ్లుగా మేకిన్‌ ఇండియా మంత్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దేశం ఎంతో కృషి చేసిందని ప్రధాని పేర్కొన్నారు.
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు వచ్చినప్పుడు.. చాలా కాలం నిలిచిపోయిన ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని గుర్తు చేశారు. 
అనంతరం భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ ఎపీజే అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. శక్తివంతమైన భారతదేశ నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేసిన కలాం స్ఫూర్తిగా నిలిచారని ప్రధాని కొనియాడారు. 

రక్షణ ఎగుమతులు 325 శాతానికి పైగా పెరిగాయని చెబుతూ, వీటిని మరింతగా పెంచేందుకు కృషి చేస్తామని ప్రధాని తెలిపారు.  కొత్త కంపెనీలు ఇప్పటికే రూ 65,000 కోట్ల ఆర్డర్లు సంపాందించాయని ఆయన చెప్పారు. ఈ కొత్త కంపెనీలు ఆర్మీ వాహనాలు, అధునాతన ఆయుధాలు, పరికరాలు, సైనిక సౌకర్యాల వస్తువులు, ఆప్టికల్‌ ఎలక్ట్రానిక్స్‌, పారాచూట్‌లను ఉత్పత్తి చేస్తాయని పేర్కొన్నారు. 

ఈ కంపెనీలు నైపుణ్యం సాధించడమే కాకుండా గ్లోబల్‌ బ్రాండ్‌గా మారాలని తమ లక్ష్యమని ప్రధాని చెప్పారు. ఏడు కొత్త రక్షణ సంస్థలతో కలిసి పనిచేయాలని ప్రధాని మోదీ స్టార్టప్‌లను కోరారు. నూతన పరిశ్రమలు యువతకు, చిన్న తరహా పరిశ్రమలకు మంచి అవకాశాలు కలిగించగలవాని చెప్పారు. 

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును ఏడు ప్రభుత్వ యాజమాన్య సంస్థలుగా విడగొట్టడం చారిత్రక నిర్ణయమని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభివర్ణించారు. కొత్త కంపెనీలతో రక్షణ రంగం సామర్థ్యం పెరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

కాగా,  కరోనా మహమ్మారి సంక్లిష్ట దశ తర్వాత మన దేశ ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా కోలుకుందని, మన దేశం పట్ల ప్రపంచం ఆశాభావంతో ఉందని ప్రధాన మంత్రి మోదీ తెలిపారు. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగే మార్గంలోకి భారత్ మరోసారి వచ్చిందని ఓ అంతర్జాతీయ సంస్థ చెప్పిందని పేర్కొన్నారు. 

ఓ బాలుర హాస్టల్ నిర్మాణానికి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) విడుదల చేసిన నివేదికలో, భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసిందని గుర్తు చేశారు.

కరోనా మహమ్మారి, వైద్య, ఆరోగ్య సంబంధిత ఆందోళనలు, సరఫరాల్లో అంతరాయాలు, ధరల ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ భారత దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని తెలిపిందని చెప్పారు.