`గాంధీ’ కుటుంబంలోనే కాంగ్రెస్ నాయకత్వం .. సోనియా స్పష్టం 

కాంగ్రెస్ పార్టీ నాయకత్వం `గాంధీ’ కుటుంభంకే పరిమితమని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్పష్టమైన సంకేతం ఇచ్చారు. కరోనా మహమ్మారి తర్వాత తొలిసారి ప్రత్యక్షంగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సమావేశంలో పార్టీలో సంస్థాగతంగా సంస్కరణలు కోరుతున్న సీనియర్ నాయకులపై పరోక్షంగా తీవ్రమైన దాడి చేశారు. 
 
తాను అధ్యక్షురాలిగా ఉండడం కేవలం తాత్కాలిక ఏర్పాటు మాత్రమే అని, పూర్తిస్థాయి అధ్యక్షుని నియామకం తక్షణమే జరగాలని గతం సంవత్సరంగా డిమాండ్ చేస్తున్న ఈ నేతలకు చురకలు అంటించారు. 
 
పార్టీకి పూర్తి కాలపు అధ్యక్షురాలిని తానేనని, తాను చురుగ్గా పని చేస్తున్నానని చెప్పారు. పైగా, ఏవైనా సమస్యలుంటే నేరుగా తనతో మాట్లాడాలని, మీడియా ద్వారా తనతో మాట్లాడవలసిన అవసరం పార్టీ నేతలకు లేదని అంటూ ఒక విధంగా  హెచ్చరిక ధోరణి ప్రదర్శించారు. 
 
కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో వరుసగా పరాజయాలు ఎదురవుతుండటంతో ఆ పార్టీకి చెందిన  23 మంది నేతలు గత ఏడాది ఆగస్టులో సోనియా గాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని వీరు డిమాండ్ చేశారు. 
 
గత నెలలో పంజాబ్ ముఖ్యమంత్రి మార్పు నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ, పార్టీకి పూర్తి కాలపు అధ్యక్షుడు లేరని, ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియదని అంటూ ఘాటుగా విమర్శించారు. వెంటనే సీడబ్ల్యూసీని సమావేశపరచాలని కోరారు. 
 
గత ఏడాది సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ నేతల్లో కపిల్ సిబల్ ఒకరు. ఆ తర్వాత కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంటిముందు నిరసన ప్రదర్శన జరిపారు. ఆయన డిమాండ్ చేసిన తర్వాతనే ఈ సమావేశం జరపడం గమనార్హం. 
 
మ‌రోవైపు 2022లో కీల‌క రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని విమ‌ర్శ‌కుల నోళ్ల మూయించేందుకు సోనియా గాంధీ కొంచెం కరకుగా మాట్లాడినట్లు కనిపిస్తున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను కట్టడి చేయడం కోసం ఆమె ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం అవుతుంది. 
 
2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పార్టీ పరాజ‌యం అనంత‌రం ఏఐసీసీ అధ్యక్ష బాధ్య‌త‌ల నుంచి రాహుల్ త‌ప్పుకోవ‌డంతో సోనియా గాంధీని తాత్కాలిక అధ్య‌క్షురాలిగా సీడ‌బ్ల్యూసీ నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. రెండేళ్లు దాటినా ఇప్పటి వరకు పూర్తిసమయపు అధ్యక్ష నియామకం జరపలేదు. 
 
తమ కుటుంభంకు చెందని వ్యక్తిని అధ్యక్షునిగా నియమించాలని ఆ సమయంలో రాహుల్ గాంధీ చెప్పినా ఆ అంశాన్ని అమలు  పరచడం లేదు. రాహుల్ గాంధీ నాయకత్వంకు అనువైన సమయం కోసమే ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తున్నది. 
 
సోనియా గాంధీ అధ్య‌క్ష‌త‌న శ‌నివారం ఢిల్లీలో జ‌రిగిన‌ కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ (సీడ‌బ్ల్యూసీ) స‌మావేశంలో స‌భ్యులంద‌రూ రాహుల్ గాంధీయే పార్టీ అధ్యక్షుడిగా ఉండాల‌నే ప్ర‌తిపాద‌న‌కు ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపారని ప్రకటించడం గమనిస్తే రాహుల్ ను తప్ప మరెవ్వరిని అధ్యక్షునిగా నియమించడానికి ఇష్ట పడటం లేదు. మరో మాటలో చెప్పాలంటే `గాంధీ’ కుటుంబంలోనే పార్టీ నాయకత్వం ఉండాలని పట్టుదలగా ఉన్నట్లు స్పష్టం అవుతుంది. 
 
నేత‌లంతా రాహుల్ నాయ‌క‌త్వానికి మ‌ద్ద‌తు ప‌లికార‌ని సీడ‌బ్ల్యూసీ స‌మావేశం అనంత‌రం పార్టీ నేత అంబికా సోని విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డించారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు అవ్వాలని కాంగ్రెస్ నాయకులందరూ ఏకగ్రీవంగా కోరుకుంటున్నారని అంబికా సోనీ తెలిపారు. 2022 సెప్టెంబర్‌లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని ఆమె చెప్పారు.
 
ఎన్నిక‌ల వ‌రకూ రాహుల్‌ను వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియ‌మించాల‌ని మ‌రి కొంద‌రు నేత‌లు సూచించారు. ఇప్పటి వరకు పార్టీ అధ్యక్ష పదవి పట్ల విముఖత వ్యక్తం చేస్తూ వస్తున్న రాహుల్ గాంధీ సహితం పార్టీ నేత‌ల ప్ర‌తిపాద‌న‌ను ప‌రిశీలిస్తాన‌ని ఇప్పుడు పేర్కొనడం గమనార్హం.