ఆరు నెలల్లో కనిష్టంగా టోకు ధరలు

టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 10.66 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 ఇదే నెలతో పోల్చితే సూచీలోని ఉత్పత్తుల బాస్కెట్‌ ధర 10.66 శాతం పెరిగిందన్నమాట. టోకు ధరల పెరుగుదల ఇంత తక్కువ స్థాయిలో నమోదుకావడం ఆరు నెలల్లో ఇదే తొలిసారే. అయినా, ఈ స్థాయి కూడా తీవ్రమే కావడం గమనార్హం. 
 
2021 మార్చిలో 7.89 శాతంగా ఉన్న టోకు ద్రవ్యోల్బణం పెరుగుదల  వరుసగా ఆరు నెలల్లోనూ రెండెంకల పైనే కొనసాగుతుండడం గమనార్హం. ‘‘2020 సెప్టెంబర్‌తో పోల్చితే 2021 సెప్టెంబర్‌లో మినరల్స్‌ ఆయిల్స్, బేసిక్‌ మెటల్స్, నాన్‌–ఫుడ్‌ ఆర్టికల్స్, క్రూడ్‌  పెట్రోలియం, సహజ వాయువు, రసాయనాలు, రసాయన ఉత్పత్తులు…ఇలా కీలక ఉత్పత్తుల ధరలు అన్నీ భారీగా పెరిగాయి’’ అని తాజా ప్రకటనలో వాణిజ్య, పరిశ్రమల శాఖ పేర్కొంది. 
 
2020 సెప్టెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం స్పీడ్‌ 1.32% అయి తే, 2021 ఆగస్టులో ఈ రేటు 11.39 శాతంగా ఉంది.  ఆహార పదార్ధాల ధరలు వరుసగా నాల్గవ నెలా తగ్గాయి. ఆగస్టులో 1.29 శాతం తగ్గితే, సెప్టెంబర్‌లో ఈ తగ్గుదల 4.69 శాతంగా ఉంది (2020 సెప్టెంబర్‌ నెలతో పోల్చి). కూరగాయల ధరలు తగ్గడం దీనికి కారణం. అయితే పప్పులు, సంబంధిత ఉత్పత్తుల ధరలు 9.42 శాతం పెరిగితే, గుడ్లు, మాంసం, చేపల ధరలు 5.18 శాతం ఎగశాయి. కూరగాయల ధరలు 32.45 శాతం, ఉల్లిపాయల ధరలు 1.91%, ఆలూ ధరలు 48.95% తగ్గాయి.
విద్యుత్, ఇంధనం ధరల బాస్కెట్‌ సెప్టెంబర్‌లో ఏకంగా 24.91 శాతం ఎగసింది. ఆగస్టులో ఈ పెరుగుదల 26.09 శాతం. క్రూడ్‌ పెట్రోలియం, సహజ వాయువుల ధరలు 43.92% ఎగశాయి. సెప్టెంబర్‌లో ఈ పెరుగదల రేటు 40.03 శాతం. ఇక సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం పెరుగుదల 11.41%గా ఉంది.  

టోకుద్రవ్యోల్బణం పెరుగుదల ఏప్రిల్‌ (10.74 శాతం), మే (13.11 శాతం) జూన్‌ (12.07 శాతం), జూలై (11.16 శాతం), ఆగస్టు (11.39 శాతం) నెలల్లో రెండంకెల మీదే కొనసాగింది. అయితే ప్రస్తుతం ఈ స్థాయి ద్రవ్యోల్బణం కొనసాగడానికి 2020 ఇదే నెలల్లో  ద్రవ్యోల్బణ పరిస్థితిపై లో బేస్‌ ఎఫెక్ట్‌ ఉండడమూ కారణమన్న అంచనాలు ఉన్నాయి.