‘మొలాసిస్‌ పొటాష్‌’కూ రాయితీ

మొలాసిస్‌ నుంచి తయారుచేసే పొటాష్‌ (పీడీఎం)పై రాయితీని నిర్ణయించినట్టు కేంద్రం తెలిపింది. పోషకాధార రాయితీ (ఎన్‌బీఎస్‌) పరిధిలోకి పీడీఎంను తీసుకురావడం ఇదే మొదటిసారి. ఇది మినరల్‌ ఆధారిత పొటాష్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది. 
 
ఎరువుల కంపెనీలు రైతులకు రూ.600-800కు విక్రయించే 50 కిలోల పీడీఎం బస్తాపై రూ.73 రాయితీ ఇస్తామని తెలిపింది. ‘ఈ నిర్ణయంతో ఉప ఉత్పత్తిగా మొలాసిస్‌ను తయారుచేసేందుకు చక్కెర మిల్లులు ఆసక్తి చూపుతాయి. తద్వారా మిల్లులతో పాటు చెరకు రైతుల ఆదాయం పెరుగుతుంద’ని పేర్కొంది. 
 
అంతేకాక పూర్తిగా మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ (ఎంవోపీ) దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని తెలిపింది. ప్రస్తుతం ఏడాదికి రూ.7,160 కోట్ల విలువైన 42 లక్షల టన్నుల ఎంవోపీని దిగుమతి చేసుకుంటున్నట్టు వివరించింది. ఇప్పటి వరకు మట్టి పోషకాలైన నత్రజని (ఎన్‌), ఫాస్పేట్‌ (పీ), పొటాష్‌ (కే), సల్ఫర్‌ (ఎస్‌) ఉన్న 22 రకాల ఎరువులకే ఎన్‌బీఎస్‌ కింద కేంద్రం రాయితీ ఇస్తున్నది. 
 
ఈ ఏడాది మేలో ఎన్‌బీఎస్‌ కింద రెండు కాంప్లెక్స్‌ ఎరువులను కూడా చేర్చింది. తాజాగా పీడీఎంను కూడా చేర్చడంతో మొత్తం రకాల సంఖ్య 25కు పెరిగింది. అలాగే ఫాస్పేట్‌, పొటాష్‌ ఎరువులపై రాయితీని అక్టోబర్‌ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. ప్రత్యేక వన్‌-టైమ్‌ ప్యాకేజీ కింద డీఏపీపై రాయితీని బస్తాకు రూ.438 పెంచింది.