తదుపరి ప్రైవేటీకరణ లక్ష్యం బిపిసిఎల్‌!

ఎయిర్ ఇండియా ను టాటా గ్రూపునకు అప్పగించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం  తర్వాత ప్రయివేటీకరణ లక్ష్యాన్ని భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బిపిసిఎల్‌)పై పెట్టిందని తెలుస్తోంది. ఈ సంస్థతో పాటు మరో అరడజన్‌ పైగా ప్రభుత్వ రంగ సంస్థలలో  వాటాల విక్రయం లేదా ప్రయివేటీకరణ చేయడానికి కేంద్ర తీవ్ర కసరత్తు చేస్తుంది.

వచ్చే మార్చి ముగింపు నాటికి బిపిసిఎల్‌, ఎల్‌ఐసి, ఐడిబిఐ బ్యాంక్‌. పవన్‌హాన్స్‌, నీలంచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌, సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తదితర పిఎస్‌యులు కీలక డిజిన్వెస్ట్‌మెంట్‌ జాబితాలో ఉన్నాయి. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక బీమా సంస్థ కూడా ప్రయివేటీకరించే ప్రయత్నం చేస్తున్నారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో పిఎస్‌యుల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ.1.75 లక్షల కోట్లను సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. ఇప్పటికే యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌ఎండిసి, హడ్కో మొదలైన వాటిలో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.8,369 కోట్లు సమకూరాయి. 

గత వారంలో ఎయిర్ ఇండియా ను టాటా గ్రూపునకు కట్టబెట్టడం ద్వారా రూ.18వేల కోట్లు పొందింది. ఇప్పటి వరకు పలు సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.26,369 కోట్లు సేకరించింది. రూ.1.75 లక్షల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాన్ని చేరడానికి దీపమ్‌ వేగంగా కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. 

వచ్చే మార్చి కల్లా బిపిసిఎల్‌ విక్రయం పూర్తివుతుందని దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత్‌ పాండే ఇటీవల పేర్కొన్నారు. ఈ పిఎస్‌యులో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)కు అనుమతిస్తూ కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందులో ఆటోమెటిక్‌ పద్దతిలో ఎఫ్‌డిఐలను అనుమతించడానికి వీలుగా నిబంధనలు మార్చింది. 

దీంతో బిపిసిఎల్‌ను విదేశీ కార్పొరేట్‌ కంపెనీకి కట్టబెట్టడానికి అవకాశం ఉంది. దేశంలోనే రెండో అతిపెద్ద చమురు కంపెనీగా ఉన్న బిపిసిఎల్‌లోని ప్రభుత్వానికి ఉన్న 53 శాతం వాటాను విక్రయించనుంది. బిపిసిఎల్‌లోని వాటా విక్రయం ద్వారా రూ.52వేల కోట్ల నిధులు వస్తాయని అంచనా వేస్తోంది. దేశంలోనే అత్యధిక టర్నోవర్‌ కలిగిన కంపెనీల్లో 6వ స్థానంలో ఉంది.