ఇంకా 22 రోజుల‌కు స‌రిప‌డా బొగ్గు నిల్వ‌లు

బొగ్గు ఉత్ప‌త్తి లేక‌పోవ‌డం వ‌ల్ల దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్తు కొర‌త ఏర్ప‌డిన‌ట్లు వస్తున్న కథనాలను ఇవాళ బొగ్గు గ‌నుల‌ శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషి కొట్టిపారవేసారు. విద్యుత్తు శాఖ కంపెనీల‌కు కావాల్సిన బొగ్గును స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం రోజున రికార్డు స్థాయిలో బొగ్గు స‌ర‌ఫ‌రా చేశామ‌ని, కోల్ ఇండియాతో పాటు బొగ్గు శాఖ డిమాండ్‌ను అందుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

 ప్ర‌స్తుతం కోల్ ఇండియా వ‌ద్ద ఇంకా 22 రోజుల‌కు కావాల్సినంత బొగ్గు నిల్వ‌లు ఉన్న‌ట్లు మంత్రి తెలిపారు. బొగ్గు విష‌యంలో ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని భరోసా ఇచ్చారు. సోమ‌వారం రోజున‌ 1.95 మిలియ‌న్ ట‌న్నుల బొగ్గును స‌ర‌ఫ‌రా చేశామ‌ని, ఇది ఇప్ప‌టి వ‌ర‌కు రికార్డు అని చెప్పారు. వేగంగా బొగ్గును స‌ర‌ఫ‌రా చేస్తూనే ఉంటామ‌ని పేర్కొన్నారు.

వ‌ర్షాకాలం ముగిసిన త‌ర్వాత బొగ్గు స‌ర‌ఫ‌రా మరింత పెరుగుతుంద‌ని మంత్రి జోషి వెల్ల‌డించారు. అక్టోబ‌ర్ 21వ తేదీ త‌ర్వాత ప్ర‌తి రోజు 20 ల‌క్ష‌ల ట‌న్నుల బొగ్గును స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని తెలిపారు. అవ‌స‌రానికి తగిన‌ట్లు దేశానికి బొగ్గును స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని హామీ ఇస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.

మ‌రో వైపు ఇవాళ బొగ్గు మైనింగ్‌కు చెందిన మూడ‌వ ద‌శ వేలం ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. అత్య‌ధిక సంఖ్య‌లో గ‌నుల‌కు లీజుకు ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. భార‌త్‌లో ఉన్న బొగ్గు నిల్వ‌ల‌ను వాడుకోవాల‌ని మంత్రి ప్ర‌హ్లాద్ జోషి పెట్టుబ‌డిదారుల‌ను కోరారు. వివిధ కంపెనీల‌కు కేటాయించిన బొగ్గు గ‌నుల‌ను ఓపెన్ చేయాల‌ని ఆయా రాష్ట్రాల‌ను ఆయ‌న కోరారు. దీంతో దేశంలో బొగ్గు నిల్వ‌లు పెర‌గ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.