ఈడీ ఎదుట మరోసారి రాజస్థాస్‌ సీఎం సోదరుడు

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్‌ సోమవారం మరోసారి ఢిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట మరోసారి హాజరయ్యారు. ఎరువుల ఎగుమతిలో జరిగిన అక్రమాలకు సంబంధించి ఈడీ ఆయనకు ఇటీవల సమన్లు జారీ చేసింది. 

ఈ నేపథ్యంలో తన తరుఫు న్యాయవాదితో కలిసి ఈడీ కార్యాలయానికి అగ్రసేన్‌ గెహ్లాట్‌ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈడీ అధికారులు తనను పదే పదే ఎందుకు పిలుస్తున్నారో తెలియదని చెప్పారు. 

ర‌సాయ‌న ఎరువుల ఎగుమ‌తిలో చ‌ట్ట విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించారని ఆరోపిస్తూ అగ్ర‌సేన్‌ గెహ్లాట్‌పై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఇదే కేసులో ఆయన గత నెలలో కూడా ఢిల్లీలోని ఈడీ కార్యాల‌యానికి విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. అగ్ర‌సేన్ గెహ్లాట్ త‌న‌యుడు అనుప‌మ్ కూడా ఈడీ ముందు హాజ‌రై వాంగ్మూలం ఇచ్చారు.

కాగా, గ‌తేడాది జూలైలో రాజ‌స్థాన్‌లోని అగ్ర‌సేన్ గెహ్లాట్ వ్యాపార సంస్థ‌ల‌పై ఈడీ దాడులు జ‌రిపింది. సీఎం అశోక్ గెహ్లాట్‌, కాంగ్రెస్ పార్టీ నేత స‌చిన్ పైల‌ట్ మ‌ధ్య రాజ‌కీయ విభేదాలు తలెత్తిన తరుణంలో ఈ దాడులు జ‌రుగ‌డం గ‌మ‌నార్హం.