చైనా తయారీ టెస్లా కార్లు ఇక్కడ అమ్మొద్దు

చైనాలో తయారు చేస్తున్న కార్లను భారత్‌లో అమ్మకూడదని టెస్లా కంపెనీకి భారత్‌ తేల్చిచెప్పింది. టెస్లా కార్లను భారత మార్కెట్‌లో అమ్ముకోవాలంటే ఇక్కడే తయారుచేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరి స్పష్టం చేశారు.  అలాగే, భారత్ నుంచే కార్లను ఎగుమతి చేసుకోవచ్చునని టెస్లాకు తెలిపారు.

అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీదారు టెస్లా కంపెనీ అధినేత ఎలోన్‌ మస్క్‌తో తాను జరిపిన సంభాషణను ఇండియా టుడే కాంక్లేవ్‌-2021 లో గడ్కరీ వెల్లడించారు. గల్వాన్‌ లోయలో భారత సైన్యంతో ముఖాముఖి పోరాటం జరిపి దాదాపు 20 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. 

మరోసారి సరిహద్దులో తోక జాడించేందుకు చైనా సైన్యం సిద్ధపడుతున్నది. గత కొన్ని రోజులుగా వైరంతో ఉన్న చైనాకు సరైన జవాబు చెప్పేందుకు భారత్‌ చర్యలు తీసుకుంటున్నది. దీనిలో భాగంగా అమెరికన్‌ విద్యుత్ కార్ల తయారీ కంపెనీ టెస్లా.. చైనా నుంచి భారత్‌తో కార్లను అమ్మకూడదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టంచేశారు.

కాగా, భారత్‌లో త్వరలోనే టెస్లా ఎలక్ట్రిక్‌ కార్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని, రాబోయే కొద్ది నెలల్లోనే కారును లాంచ్‌ చేసే అవకాశం ఉందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. భారత్‌ మార్కెట్‌లో ప్రవేశానికి ముందు టెస్లా, ప్రభుత్వానికి మధ్య నిరంతరం చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. టెస్లా భారత్‌లో ఉత్పత్తిని ప్రారంభించడానికి ముందు.. ఇక్కడి నుంచి ఇతరదేశాలకు కార్లను ఎగుమతి చేసేందుకు ఏ సహాయం కావాలన్న ప్రభుత్వం సిద్ధంగా ఉందిని తెలిపారు. 

భారత మార్కెట్లో టెస్లా కార్లను అమ్మాలనుకుంటే ఇక్కడి నుంచే ఉత్పత్తి ప్రారంభించాలని ఎలోన్‌ మస్క్‌కు చెప్పానని, ఇక్కడ తయారీ ప్రారంభిస్తే ప్రభుత్వం తరఫున కావాల్సిన సాయం అందిస్తామని తెలిపానని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్‌ కార్యక్రమం కింద స్థానికంగా బ్యాటరీల ఉత్పత్తి పెరుగుతున్నదని, సమీప భవిష్యత్‌లో విద్యుత్‌ బ్యాటరీలను ఎగుమతి చేసే స్థితిలో భారత్‌ ఉంటుందని నితిన్‌ గడ్కరీ భరోసా వ్యక్తం చేశారు. 

ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆటో మార్కెట్‌గా ఉన్న భారతదేశంలో టెస్లా తన వ్యాపారాన్ని మొదలుపెట్టడంలో ఇది అదనపు ప్రయోజనాలను అందిస్తుని తెలిపారు. ముందుగా విద్యుత్‌ కార్లను తయారీని ప్రారంభిస్తే.. ఆ తర్వాత దిగుమతి సుంకం తగ్గింపు విషయాన్ని పరిశీలిస్తామని టెస్లా కంపెనీకి చెప్పినట్లు గడ్కరీ వెల్లడించారు.