కశ్మీరు లోయలో మైనారిటీల లక్ష్యంగా దాడుల పట్ల ఆందోళన 

కశ్మీరు లోయలో మైనారిటీ మతస్థులైన హిందూ, సిక్కులపై ఉగ్రవాద దాడులు జరుగుతుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 2000వ సంవత్సరంలో ఛట్టిసింగ్‌పొరలో 36 మంది సిక్కులను ఊచకోత కోసిన సంఘటన గుర్తుకొస్తోందని మైనారిటీలు చెప్తున్నారు. పాకిస్థాన్ మద్దతుగల తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత కశ్మీరు లోయలో ఉగ్రవాద చర్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. 

శ్రీనగర్ జిల్లాలోని సంగం ఈద్గా ప్రాంతంలో ప్రభుత్వ బాలుర హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ సుపిందర్ కౌర్‌ (సిక్కు)ను, టీచర్ దీపక్ చంద్ (హిందూ)ను ఉగ్రవాదులు గురువారం హత్య చేశారు. ఈ పాఠశాలలో పని చేస్తున్నవారి ఐడెంటిటీ కార్డులను తనిఖీ చేసి, వీరిని గుర్తించి మరీ హత్య చేసినట్లు ఓ టీచర్ మీడియాకు చెప్పారు. 

ఈ సంఘటనపై సిక్కు మతస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  కశ్మీరు లోయలోని సిక్కు ప్రభుత్వోద్యోగులు తమ విధులను బహిష్కరించాలని ఆల్ పార్టీస్ సిక్కు కోఆర్డినేషన్ కమిటీ పిలుపునిచ్చింది. భద్రతపై ప్రభుత్వం భరోసా కల్పించే వరకు ఇళ్ళ వద్దనే ఉండాలని తెలిపింది. 

ఈ కమిటీ చైర్మన్ జగ్‌మోహన్ సింగ్ రైనా మాట్లాడుతూ, ఇటీవలి హత్యలపై తాము తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నామని చెప్పారు. 2000వ సంవత్సరంలో ఛట్టిసింగ్‌పొరలో 36 మంది సిక్కులను ఊచకోత కోసిన సంఘటన గుర్తుకొస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం స్పందించిన తర్వాత తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.

శిరోమణి అకాలీదళ్ (బి) అధ్యక్షుడు సుఖ్‌బీర్ బాదల్ స్పందిస్తూ, కశ్మీరు లోయలో పద్ధతి ప్రకారం మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారన్నారు. మైనారిటీలైన సిక్కులకు భద్రతను పెంచాలని కేంద్ర ప్రభుత్వం, జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలను కోరారు. 

కశ్మీరు లోయలో ఈ వారంలో హిందూ పండిట్ మఖన్ లాల్ బింద్రూ, వీరేందర్ పవన్, మహమ్మద్ షఫీ లోన్ వేర్వేరు ఉగ్రవాద సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. పుల్వామా, బారాముల్లా, బుడ్గామ్, శ్రీనగర్ జిల్లాల్లో సిక్కులు దాదాపు 50 వేల మంది ఉన్నారు.