అరుణాచల్ లో చొరబడ్డ చైనా సైనికుల గెంటివేత

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నాయి. ఆ ప్రాంతంలో దూసుకువ‌చ్చిన చైనా సైనిక ద‌ళాల‌ను భార‌త ఆర్మీ తిప్పికొట్టిన‌ట్లు తెలుస్తోంది. నెల రోజుల క్రితం ఉత్త‌రాఖండ్ స‌రిహ‌ద్దుల్లోనూ చైనా ద‌ళాలు భార‌త భూభాగంలోకి ప్ర‌వేశించిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా వెల్ల‌డ‌వుతోంది. 

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఉన్న వాస్త‌వాధీన రేఖ‌పై రెండు దేశాల‌కు భిన్న అభిప్రాయాలు ఉన్నాయ‌ని, అయితే రెండు దేశాల సైనికులు త‌మ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద భార‌త‌, చైనా సైనికుల మ‌ధ్య కొన్ని గంట‌ల పాటు భౌతిక ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్న‌ట్లు చెబుతున్నారు. 

అయితే ఆ త‌ర్వాత ఇరు దేశాల సైనికులు మ‌ళ్లీ వెనుదిరిగిన‌ట్లు తెలుస్తోంది. అరుణాచ‌ల్ ఘ‌ట‌న‌లో భార‌త ర‌క్ష‌ణ ద‌ళాల‌కు ఎటువంటి న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని స్ప‌ష్ట‌మైంది. గ‌తంలోనూ అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఉన్న వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద ప‌లుమార్లు చైనా ద‌ళాలు అక్ర‌మంగా చొర‌బ‌డే ప్ర‌య‌త్నం చేశాయి. ఆ ప్రాంతంలో అనేక‌సార్లు ఘ‌ర్ష‌ణాత్మ‌క వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.

ఉత్త‌రాఖండ్‌లోని నందాదేవి ఫారెస్ట్ వ‌ద్ద ఉన్న బారాహోటి ప్రాంతం స‌మీపంలో ఆగ‌స్టు 30వ తేదీన చైనా ద‌ళాలు చొర‌బ‌డ్డాయి. అక్క‌డ ఉన్న వాస్త‌వాధీన రేఖ‌ను దాటి సుమారు 5 కిలోమీట‌ర్ల లోప‌లికి 100 మంది పీఎల్ఏ సైనికులు వ‌చ్చిన‌ట్లు అధికారులు చెప్పారు. అయితే ఇండో టిబెట్ బోర్డ‌ర్ పోలీసులు ప‌హారాకాస్తున్న ఆ ప్రాంతాన్ని కొన్ని గంట‌ల్లోనే పీఎల్ఏ ద‌ళాలు ఖాళీ చేసిన‌ట్లు తెలుస్తోంది. 

బారాహోటి ప్రాంతంలో ఇటీవ‌ల ఎల్ఏసీ వ‌ద్ద ప‌లుమార్లు ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నాయి. ఇరు దేశాల‌కు అక్క‌డి రేఖ వ‌ద్ద భిన్నాభిప్రాయాలు ఉన్న నేప‌థ్యంలో ఆ ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది.

గ‌త ఏడాది ల‌డాఖ్‌లో చైనా సైనికుల‌తో ప్ర‌తిష్ఠంభ‌న నెల‌కొన్న నేప‌థ్యంలో.. సుమారు 3500 కిలోమీట‌ర్ల పొడువైన వాస్త‌వాధీన రేఖ వెంట భార‌త్ గ‌ట్టి ప‌హారా కాస్తున్న‌ది. గ‌త ఏడాది పాన్‌గాంగ్ ఏరియా వ‌ద్ద ఇరు దేశాల‌కు చెందిన సైనికులు కొట్టుకున్న విష‌యం తెలిసిందే. లైన్ ఆఫ్ యాక్టువ‌ల్ కంట్రోల్ పొడుగునా సున్నిత‌మైన ప్రాంతాల్లో భార‌త్ సుమారు 60 వేల మంది ద‌ళాల‌ను మోహ‌రించిన‌ట్లు తెలుస్తోంది