విశ్వసనీయత కోల్పోయిన జగన్ ప్రభుత్వం

ఆంధ్ర ప్రదేశ్ లోని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజావిశ్వాసం కోల్పోయినదని బిజెపి రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ గురజాల ఆర్డీవో కార్యాలయ ఎదురు నిర్వహించిన మహాధర్నాలో పాల్గొంటూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కోట్లాది రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుందని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వ నిధులకు రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా లెక్కలు చూపడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభం లో కూరుకుపోవడంతో పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని ఆయన చెప్పారు.

కాగా, పల్నాడులో అధికార పార్టీ అక్రమాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, ఇసుక, మట్టి, మైనింగ్  అక్రమ మద్యం దందా యదేచ్చగా కొనసాగుతుందని జివిఎల్ దుయ్యబట్టారు. తెలుగుదేశం పాలనలో రిటైల్ గా అక్రమాలు జరిగితే వైసిపి పాలనలో హోల్ సేల్ గా జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు.

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో బాధ్యతల నుండి పారిపోయిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడవలసిన తెలుగుదేశం పార్టీ కుంటిసాకులతో ఎన్నికల పాల్గొనకుండా వెనకడుగు వేస్తుందని పేర్కొన్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష బాధ్యతను బిజెపి తీసుకొని ప్రతి ఎన్నికలలో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.