ప్లేయర్ ఆఫ్‌ది ఇయర్‌గా హర్మన్, గుర్జిత్

అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) వార్షిక అవార్డులన్నీ భారత్‌కే దక్కాయి. చరిత్రలో తొలిసారి అత్యధిక అవార్డులు భారత్‌ను వరించాయి. మొత్తం 8 అవార్డులు టీమ్‌ఇండియా బృందానికి రాగా వారిలో ఆరుగురు ఆటగాళ్లతో పాటు ఇద్దరు కోచ్‌లు ఉన్నారు. ఇందులో అత్యుత్తమ ప్లేయర్‌ అవార్డును హర్మన్‌ప్రీత్‌సింగ్‌, గుర్జీత్‌కౌర్‌ దక్కించుకున్నారు.

2020-21కి సంబంధించి ఎఫ్‌ఐహెచ్ అవార్డులను ప్రకటించింది. గోల్‌కీపర్ల విభాగంలో సీనియర్‌ ప్లేయర్‌ పీఆర్‌ శ్రీజేశ్‌, సవితా పునియా అవార్డులకు ఎంపికయ్యారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న యువ ప్లేయర్లకు ఇచ్చే రైజింగ్‌ స్టార్‌ అవార్డును వివేక్‌సాగర్‌ ప్రసాద్‌, షర్మిలా దేవి కైవసం చేసుకున్నారు.

ఇటీవల ముగిసిన ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్లు సత్తా చాటిన విషయం తెలిసిందే. పురుషుల జట్టు 41 ఏండ్ల తర్వాత కాంస్యం కైవసం చేసుకోగా మహిళల జట్టు తీవ్రంగా శ్రమించి చివరకు కొద్దిలో పతకం చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రకటించిన అవార్డుల్లో భారత క్రీడాకారులకు ప్రాధాన్యత లభించింది.

పెనాల్టీ కార్నర్ నిపుణులు హర్మన్ ప్రీత్ సింగ్, గుర్జిత్ కౌర్‌లు పురుషులు, మహిళల విభాగంలో ప్లేయర్ ఆఫ్‌ది ఇయర్ పురస్కారాలను గెలుచుకున్నారు. పురుషుల విభాగంలో భారత్ కాంస్య పతకం సాధించడంలో హర్మన్‌ప్రీత్ కీలక పాత్ర పోషించాడు. ఇక మహిళల జట్టు సెమీఫైనల్లో చేరడంలో గుర్జిత్ కౌర్ ముఖ్య భూమిక పోషించింది. మరోవైపు పిఆర్ శ్రీజేష్, సవితా పునియాలు గోల్ కీపర్ ఆఫ్‌ది ఇయర్‌గా నిలిచారు. వీరిద్దరూ కూడా అసాధారణ ప్రతిభతో ప్రత్యర్థి జట్లు గోల్ చేయకుండా అడ్డుకున్నారు.

టోక్యో క్రీడల్లో భారత్ కాంస్యం కోసం జరిగిన పోరులో బలమైన జర్మనీని చిత్తుగా ఓడించి పతకం కొరతను తీర్చింది. మహిళల జట్టు పతకం సాధించక పోయినా అసాధారణ ఆటతో నాలుగో స్థానంలో నిలిచి పెను ప్రకంపనలు సృష్టించింది.