వైద్యశాస్త్రంలో నోబెల్ కు సాయపడిన భారత్ లాబ్

మెడిసిన్‌లో నోబెల్ బహుమతి పొందిన ఆర్డెమ్ పటపౌషియన్, డేవిడ్ జులియస్ చేసిన కృషి ప్రాధాన్యాన్ని నిరూపించడంలో భారత దేశంలోని ప్రభుత్వ ప్రయోగశాల ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (ఐఐసీబీ) సేవలందించింది. మానవులు ఉష్ణోగ్రత, స్పర్శను ఫీల్ అయ్యేందుకు వీలు కల్పించే రిసెప్టర్లను కనుగొన్నందుకు వీరికి సోమవారం నోబెల్ బహుమతి వచ్చింది. 

2010కి పూర్వం తెలియని జీవశాస్త్ర మౌలికాంశం అయిన నరాల వ్యవస్థలో పీజో చానల్స్‌ను పటపౌషియన్ కనుగొన్నారు. ఈ చానల్స్ ఇతర వేర్వేరు శారీరక కార్యకలాపాల్లో ఎటువంటి పాత్రను పోషిస్తున్నాయో తెలుసుకునేందుకు అనేక ల్యాబ్స్ కృషి చేశాయి.  ఉదాహరణకు, లీడ్స్ విశ్వవిద్యాలయంలోని డేవిడ్ బీచే ల్యాబ్‌ 2014లో నిర్వహించిన పరీక్షల్లో ఈ చానల్స్‌కుగల ప్రెజర్ సెన్సింగ్ ఫంక్షన్ వల్ల కార్డియోవాస్కులార్ సిస్టమ్‌లో ఇవి ముఖ్యమైనవిగా మారినట్లు వెల్లడైంది. రక్త పోటులో మార్పులను ఇవి గుర్తించగలుగుతున్నట్లు వెల్లడైంది. 

డ్యూక్ విశ్వవిద్యాలయంలోని వూల్ఫ్‌గ్యాంగ్ లీడ్‌కే గ్రూపు 2014లో వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ పీజో చానల్స్ కీళ్ళలోని కార్టిలేజ్‌లో ఒత్తిడిని గుర్తుపట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. 

భారత దేశంలోని ప్రభుత్వ ప్రయోగశాల ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీలో ఇమ్యునాలజిస్ట్ దిప్యమాన్ గంగూలీ నేతృత్వంలో జరిగిన పరీక్షల్లో, శరీరంలోని ఫిజికల్ క్యూస్‌ను గుర్తించడం కోసం ఇమ్యూన్ సిస్టమ్ సెల్స్ ఈ పీజో చానల్స్‌పై ప్రధానంగా ఆధారపడుతున్నట్లు 2018లో గుర్తించారు. ఈ ప్రయోగశాలను 1935లో కొలకత్తాలో నెలకొల్పారు

గంగూలీ మాట్లాడుతూ, ఆర్డెమ్ పటపౌషియన్, డేవిడ్ జులియస్ ప్రశంసలకు అర్హులని చెప్పారు. ప్రస్తుతం ఈ రంగంలో మన దేశంలో ఉన్న ఏకైక ల్యాబ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ అని తెలిపారు. పట సపౌషియన్   కృషికి గల ప్రాధాన్యాన్ని నిరూపించడంలో సహాయపడినందుకు తమకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. 

కాగా, ఐఐసిబి కలరా కోసం నోటి టీకాను అభివృద్ధి చేసింది, గ్యాస్ట్రిక్ అల్సర్‌ను నియంత్రించడానికి మూలికా ఉత్పత్తులు, బొల్లి కోసం అనుభావిక చికిత్స, ప్రాణాంతకత, హార్మోన్ల రుగ్మతలకు డయాగ్నొస్టిక్ కిట్‌లు, పారిశ్రామిక ప్రాముఖ్యత కలిగిన ఫంగల్ ఎంజైమ్‌లు, మూత్రపిండ, హెపాటోబిలియరీ వ్యవస్థల పనితీరు స్థితిని అంచనా వేయడానికి రేడియో ఫార్మాస్యూటికల్స్ పార్కిన్సన్స్ వ్యాధిని ముందుగానే గుర్తించే పరికరంలను కూడా తయారు చేసింది.