
ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ‘పండోరా పేపర్స్’పై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయడానికి సిద్ధమైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సేషన్ (సీబీడీటీ) ఆధ్వర్యంలో బహుళ ఏజెన్సీల బృందంతో ఈ దర్యాప్తు చేపట్టున్నట్లు ప్రబుత్వం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు పన్నులు కట్టకుండా విదేశాల్లో దాచుకున్న సంపద రహస్యాలను ‘పండోరా పేపర్స్’ బయటపెట్టాయి.
ఎన్‌ఫోర్స్‌మెంట్, ఆర్‌బిఐ, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్‌ఐయు), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సస్ (సిబిడిటి)లతో దర్యాప్తు చేయిస్తామని ప్రకటించింది. ఈ విచారణ కమిటీకి సిబిడిటి చైర్మన్ నేతృత్వం వహించనున్నారు. సరైన విచారణ చేపట్టి.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఐదేళ్ల క్రితం వెలుగు చూసిన ‘పనామా పేపర్స్’ కన్నా తాజా పత్రాలు మరింత కలకలం రేపగా, వాటిల్లో పేర్కొన్న పేర్లలో చాలా తక్కువ పేర్లు మాత్రమే బయటకు వచ్చాయని సీబీడీటీ తెలిపింది. సంబంధిత పన్ను చెల్లింపు దారులు, సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని పొందేందుకు విదేశీ అధికార పరిధిపై ముందుగానే దృష్టి సారిస్తోంది.
తక్కువ పన్ను దేశాల్లో సంపదను తరలించిన వారి వివరాలు పండోరా పేపర్స్‌లో బట్టబయలైంది. ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ (ఐసిఐజె) ఈ పేపర్లను విడుదల చేసింది. ఈ జాబితాలో 91 దేశాలకు చెందిన ప్రస్తుత, మాజీ ప్రపంచ నేతలు, రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలు ఉండగా, వారిలో 300 మంది వరకు భారతీయులు ఉన్నట్లు తెలుస్తున్నది.
వీరిలో అత్యధికంగా సిబిఐ, ఇడి కేసులు, ఆర్థిక నేరాల అభియోగాలను ఎదుర్కొంటున్న వారే ఎక్కువగా ఉన్నారు. ఈ నల్ల కుబేరులంతా తాము అక్రమంగా ఆర్జించిన సొమ్మును పన్ను ఎగవేత దేశాల్లో అత్యంత సంక్లిష్టమైన ట్రస్టులు, కంపెనీల్లో దాచుకుంటున్నారు. ఒకవేళ దర్యాప్తు సంస్థలు వాటి దాకా చేరినా ఆ ట్రస్టులు, కంపెనీల అసలు యజమానులెవరో తెలుసుకోవడం దాదాపు అసాధ్యమేనని ఈ కధనం పేర్కొంది.
వారిలో 60 మంది ప్రముఖల చిట్టాను ప్రముఖ వార్తా సంస్థ సంపాదించినట్లు తెలుస్తోంది. వారిలో ఆరుగురు మాజీ ఎంపిలు కూడా ఉన్నారని సమాచారం. వీరే కాకుండా ఆ జాబితాలో ఉన్న వారిలో ప్రముఖ వ్యాపార వేత్త అనిల్ అంబానీ, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బయోకాన్ సిఇఒ కిరణ్ మజుందర్‌షా భర్త ఉన్నట్లు తెలుస్తోంది.
బ్రిటన్ కోర్టులో దివాలా తీశానని చెప్పుకుంటున్న అనిల్ అంబానీకి 18 ఆఫ్ షోర్ కంపెనీలున్నట్లు సమాచారం. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కుచ్చుటోపి పెట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ సోదరి కూడా ఆఫ్ షోర్ కంపెనీని పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన పరారవ్వడానికి నెల రోజుల ముందే ఈ కంపెనీని ఏర్పాటు చేయడం గమనార్హం.
ఈ జాబితాలోని పలువురు బిలియనీర్లు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలు ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 29వేల డొల్ల కంపెనీలు, ట్రస్టుల్లో అక్రమ పెట్టుబడులు పెట్టారని పండోరా పేపర్స్‌లో తేలింది. ఈ దొంగ వ్యవహారాలను నెరవేర్చడానికి ఏ దేశం వారికైనా సేవలందించేందుకు 14 అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు పనిచేస్తున్నాయి.
ఇవి పన్ను ఎగవేతకు అనుకూలమైన దేశాల్లో 29వేలకు పైగా కంపెనీలను, ప్రయివేటు ట్రస్టులను ఏర్పాటు చేయడంలో సహకరించాయి. ఆయా దేశాల్లో అక్రమార్కులు, పన్ను ఎగవేతదారులకు ప్రధానంగా సేవలందిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యున్నత రాజకీయ నాయకులైన 336 మందికి విదేశాల్లో 956 కంపెనీలు ఉన్నాయి.
ఈ కంపెనీల్లో మూడింట రెండు వంతుల కంపెనీలు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లోనే ఉన్నాయి. సింగపూర్, న్యూజిలాండ్, అమెరికా వంటి దేశాల్లోనూ వీటిని ఏర్పాటు చేశారు. వీటి యజమానులు వారి ఆస్తుల వివరాలను ఈ రిపోర్టులో వెల్లడించింది. పాకిస్థాన్‌కు చెందిన 700 మంది కూడా ఈ చిట్టాలో ఉన్నట్లు ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఇందులో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనుయాయులు ఉన్నారని తెలిపింది.
More Stories
రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది
కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం!