బాధిత కుటుంబాల‌కు రూ.45 ల‌క్ష‌లు.. రిటైర్డ్ జ‌డ్జితో విచారణ

బాధిత కుటుంబాల‌కు రూ.45 ల‌క్ష‌లు.. రిటైర్డ్ జ‌డ్జితో విచారణ

లఖింపూర్ ఖేరిలో ఆదివారం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు రూ.45 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ కుటుంబాల్లో ఒకరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని భరోసా ఇచ్చింది. 

క్షతగాత్రులకు సైతం రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇస్తుందని యూపీ ఏడీజీ (శాంతిభద్రతలు) ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై రిటైర్డ్ హైకోర్టు జడ్జి దర్యాప్తు జరుపుతారని చెప్పారు. లఖింపూర్ ఖేరిలో ప్రశాంత్ కుమార్ సోమవారం పర్యటించారు. ఈ విషయమై పోలీస్ అధికారులతో ఒప్పందం కుదరడంతో రైతు నాయకులు హింసకు వ్యతిరేకంగా జరుపుతున్న ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటించారు. మృతదేహాలను శవపరీక్షకు తీసుకెళ్లడానికి అనుమతించారు. 

144 సెక్షన్ విధించినందున జిల్లాలోకి రైతు సంఘాల సభ్యులను మినహా రాజకీయ పార్టీల నేతలను ఎవ్వరినీ అనుమతించమని ఆయన చెప్పారు. కాగా, లఖింపూర్‌ హింసాత్మక ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మృతుల్లో రైతులు, బీజేపీ కార్యకర్తలు ఉన్నారని తెలుస్తోంది. 

ఆదివారంనాడు హెలిప్యాడ్ వద్ద నిరసన తెలుపుతున్న రైతులను చెదరగొడుతున్న సమయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా మూడు వాహనాల్లో అక్కడకు వచ్చినట్టు సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపించింది. రైతుల వైపు దూసుకువచ్చిన ఆయన చివర్లో ఎస్‌కేఎం నేత తేజిందర్ సిక్ విర్క్‌పై దాడి చేశాడని, ఆయనపై వాహనం నడిపేందుకు ప్రయత్నించాడని కూడా కిసాన్ సంయుక్త మోర్చా ఆరోపించింది. అయితే, ఎస్‌కేఎం ఆరోపణలను అజయ్ మిశ్రా, ఆయన కుమారుడు తోసిపుచ్చారు.

ఆదివారం హింసాత్మక ఘటనలో మరణించినవారి సంఖ్య 9కి చేరింది. తీవ్రంగా గాయపడిన జర్నలిస్టు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరోవైపు కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రాపై హత్య కేసుతో సహా 13 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం లఖీంపూర్ ఖీరీలో పరిస్థితి ఉద్రిక్తతగా ఉంది.

ముందు జాగ్రత్త చర్యగా ఇంటర్నెట్ నిలిపివేశారు. భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. రాజకీయ నేతలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఘటన జరిగిన తికునియా గ్రామం చుట్టూ భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంకు వెళ్లేందుకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రయత్నించడంతో సీతాపూర్ వద్ద పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ప్రియాంక పోలీసులతో వాదనకు దిగారు.

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు నిర్బంధించారు. లఖింపూర్ ఖేరి ఘటనలో మరణించిన బాధిత రైతు కుటుంబాలకు పరామర్శించేందుకు ఆయన తన ఇంటి నుంచి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అఖిలేష్‌ తన ఇంటి బయట బైఠాయించి నిరసన తెలిపారు.

ఆటబ నివాసానికి పార్టీ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో  ఆయన నివాస మార్గాన్ని మూసివేసిన పోలీసులు చివరకు అఖిలేష్‌ యాదవ్‌తోపాటు ఆ పార్టీ నేతలను నిర్బంధించారు. పోలీస్‌ వాహనంలో అక్కడి నుంచి తరలించారు.