ఉన్నతాధికారుల సమావేశంలో పంజాబ్ సీఎం కొడుకు!

పంజాబ్ డిజిపి నియామకంలో ఏకంగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దు నుండే విమర్శలు ఎదుర్కొంటున్న పంజాబ్ నూతన ముఖ్యమంత్రి  చరణ్‌జిత్ సింగ్ చన్ని తాజాగా జరిపిన ఉన్నత పోలీస్ అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి కొడుకు కనిపించడం వివాదాస్పదంగా మారింది.

 పంజాబ్ అఫీషియేటింగ్ డీజీపీ ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోటాతో సహా పలువురు సీనియర్ పోలీసు అధికారులతో ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్ని జరిపిన అత్యున్నత స్థాయి భద్రతా సమావేశంలో ఆయన కుమారుడు రిథమ్‌జిత్ సింగ్ పాల్గొనడంపై బిజెపి అభ్యంతరం వ్యక్తం చేసింది. 

బుధవారంనాడు అధికారులతో సీఎం జరిపిన అత్యున్నత స్థాయి భద్రతా సమావేశానికి రిథమ్జిత్ సింగ్ హాజరైన ఫోటోలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. అధికారుల వెనుక సీటులో రిథమ్ సింగ్ కూర్చుని ఉన్నట్టు ఆ ఫోటోల్లో కనిపిస్తోంది. సమాచార, ప్రజాసంబంధాల శాఖ ఈ ఫొటోలు విడుదల చేసింది.

బీజేపీ పంజాబ్ అధ్యక్షుడు అశ్విని శర్మ ఈ చర్యను తప్పుబాదుతూ  మాజీ కేబినెట్ మంత్రిగా ముఖ్యమంత్రి చన్నీకి నియమ నిబంధనలు తెలిసి ఉండాలని చురకలు అంటించారు. పాలనా వ్యవహారాల విశ్వసనీయత, ఔన్నత్యాన్ని సీఎం పాటించాలని హితవు చెప్పారు. సీనియర్ బ్యూరోక్రాట్లతో జరిపిన ఉత్యున్నత స్థాయి సమావేశానికి ముఖ్యమంత్రి తనయుడిని అనుమతించడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవంక, పంజాబ్ డిజిపి, అడ్వకేట్ జనరల్‌ను సొంత పార్టీ ప్రభుత్వం నుంచి ఉద్వాసన పలకాలనినవజ్యోత్  సింగ్ సిద్ధూ ఆదివారంనాడు మరోసారి డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో మనం తలెత్తుకోలేమని ఓ ట్వీట్‌లో స్పష్టం చేశారు. కీలకమైన నియామకాల విషయంలో తాను ఇప్పటికీ అసంతృప్తిగానే ఉన్నానని మరోసారి సిద్ధూ పరోక్షంగా ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సంకేతాలిచ్చారు. 

మూడు రోజుల క్రితం సిద్ధూ, చన్నీ సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాల విషయంలో ముందుగానే సంప్రదింపులు జరిపేందుకు సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సిద్ధూ తాజా ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

”అపచారాలకు సంబంధించి కేసుల్లో న్యాయం జరగాలని, డ్రగ్ వ్యాపారం వెనుక వెనుక ప్రధాన వ్యక్తులను అరెస్టు చేయాలన్న డిమాండ్‌ను 2017లో ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. ఆయన వైఫల్యం వల్లే గత సీఎంను ప్రజలను గద్దె దింపారు. ఇప్పుడు, ఏజీ/డీజీ నియామకాలతో బాధితుల గాయాలపై కారం చల్లారు. వాళ్లను తప్పించాల్సిందే. లేదంటూ తలెత్తుకోలేం” అని సిద్ధూ తన ట్వీట్‌లో ఘాటుగా స్పందించారు.