ఆందోళనకరంగా నృత్య గోపాల్‌దాస్‌ ఆరోగ్యం

అయోధ్యలోని రామజన్మభూమి ట్రస్ట్‌ అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్‌ ఆరోగ్యం క్షీణించింది. దాంతో ఆయనను మెరుగైన చికిత్స అందించేందుకు లక్నోకు తరలించారు. ఆదివారం ఉదయం నుంచి ఆయన యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నాడు. అంతకుముందు, ఆయనను అయోధ్యలోని జిల్లా హాస్పిటల్‌లో చేర్చారు. 83 ఏండ్ల వయసున్న నృత్య గోపాల్‌దాస్ మూత్ర ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నాడు. మూత్ర విసర్జన కోసం నెఫ్రాలజీ వైద్యులు బైపాస్ స్టెంట్ వేశారు. 

ఆక్సిజన్ స్థాయి సాధారణం కంటే తగ్గడంతో అదనంగా ఆక్సిజన్ కూడా అందిస్తున్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో.. వైద్యుల సూచన మేరకు అతడిని లక్నోలోని మేదాంత దవాఖానకు తరలించారు. నృత్య గోపాల్‌దాస్‌ మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదని వైద్యులు తెలిపారు. దాంతో మూత్రం సరిగా ఉత్పత్తి కావడం లేదని వారు చెప్పారు. గత ఏడాది నవంబరులో మేదాంత దవాఖానలోనే గోపాల్‌దాస్‌కు ఆపరేషన్ జరిగింది. .

“మహంత్ నృత్య గోపాల్ దాస్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) లో చేరారు. ఆయనకు మూత్ర విసర్జనలో సమస్య ఉంది. పొత్తి కడుపులో నొప్పిగా ఉంది. ఆయనకు యూరాలజీ, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నాయి” అని మెడంటా హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కపూర్ తెలిపారు.

యూరాలజీ, శ్వాసకోశ విభాగాలకు చెందిన వైద్యుల బృందం ఆయన పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని, ఆయన పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ కపూర్ చెప్పారు. కృష్ణ జన్మభూమి న్యాస్ ఛైర్మన్ కూడా అయిన దాస్ మధురలోని సీతారామ్ ఆలయంలో ఉంటున్నారు. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడంతో శ్వాస తీసుకోవడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో కొవిడ్‌ బారిన పడిన గోపాల్‌దాస్‌ కొద్ది రోజులకే కోలుకున్నారు.