భారీ మెజారిటీతో మమతా బెనర్జీ గెలుపు

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ భ‌వానీపూర్ నియోజ‌కవ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో ఘ‌న విజ‌యం సాధించారు. బీజేపీకి చెందిన ప్రియాంకా టిబ్రేవాల్‌పై ఆమె 58,832 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలోకి దూసుకెళ్లిన మ‌మ‌తా.. ఆ త‌ర్వాత ప్ర‌తి రౌండ్‌కూ త‌న ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్లారు. ఇది తృణ‌మూల్ కాంగ్రెస్ త‌ర‌ఫున కొత్త రికార్డు.

గత గురువారం నాడు భవానీపూర్ లో జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ లో 53.32శాతం ఓటింగ్ నమోదైంది. సాధారణ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఆమె ఓడిపోయారు. ఒకప్పటి తన సహచరుడు అయిన సువేందు అధికారి బీజేపీలో చేరడంతో అతడిని డీకొట్టేందుకు తన నియోజకవర్గం భవానీపూర్ ను వదిలి నందిగ్రామ్ లో నిలబడ్డారు. 

రాష్ట్రమంతటా భారీ ఆధిక్యత సాధించినప్పటికీ  నందిగ్రామ్ లో 19 వందలకు పైగా ఓట్ల తేడాతో మమత ఓడిపోయారు. దీంతో భవానీపూర్ నుంచి గెలిచిన టీఎంసీ నేత శోభన్ దేవ్ రాజీనామా తన పదవిని మమత కోసం త్యాగం చేశారు. ఉపఎన్నికలకు కాంగ్రెస్ దూరంగా ఉంది.

గ‌తంలో 2011లో 34 ఏళ్ల త‌ర్వాత‌ క‌మ్యూనిస్టుల కోట‌ను బ‌ద్ద‌లుకొట్టి మ‌మ‌తా తొలిసారి ముఖ్య‌మంత్రి అయిన స‌మ‌యంలో ఆ పార్టీ త‌ర‌ఫున 49,936 ఓట్ల మెజార్టీ న‌మోదైంది. ఇప్పుడా రికార్డును మ‌మ‌తా బెన‌ర్జీ బ్రేక్ చేశారు. మొత్తంగా మ‌మ‌త‌కు 84,709 ఓట్లు రాగా, ప్రియాంకాకు 26,320 ఓట్లు వ‌చ్చాయి.

‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ నేనే

త‌న ఓట‌మిని ప్రియాంకా అంగీక‌రించారు. అయితే వాళ్లు ల‌క్ష‌కుపైగా మెజార్టీ గెలుస్తామ‌ని చెప్పార‌ని, ఇప్పుడు అది 50 వేల‌కే ప‌రిమిత‌మైంద‌ని ఆమె గుర్తు చేశారు.  ఓటమిని హుందాగా స్వీకరిస్తున్నానని చెప్పారు. అయితే ఈ ఆటలో తాను ”మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్”గా నిలిచానని ప్రియాంక స్పష్టం చేశారు.

మమతా బెనర్జీకి గట్టిపట్టు ఉన్న నియోజకవర్గంలో తాను పోటీ చేసి, 25,000కు పైగా ఓట్లు గెలుచుకున్నానని, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచానని ఆమె పేర్కొన్నారు. మునుముందు మరింత కష్టపడి పనిచేస్తానని ఆమె  చెప్పారు. 

మ‌రోవైపు త‌న‌ను గెలిపించిన భ‌వానీపూర్ ప్ర‌జ‌ల‌కు మ‌మ‌త కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. “ఇక్క‌డ 46 శాతం మంది బెంగాలీ కాని ఓట‌ర్లు ఉన్నారు. వాళ్లంతా నాకే ఓటేశారు. నాపై న‌మ్మ‌కం ఉంచినందుకు సంతోషం. భ‌వానీపూర్ ప్ర‌జ‌ల‌కు నేనెప్పుడూ రుణ‌ప‌డి ఉంటాను” అని మ‌మ‌తా తెలిపారు. ఎమ్యెల్యే కాకుండానే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆమె ఆ పదవిలో  కొన‌సాగాలంటే ఈ ఉప ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా గెల‌వాల్సిన పరిస్థితి నెలకొంది