దోహా ఒప్పందంలో భారత్ ను పరిగణలోకి తీసుకొని అమెరికా

గత ఏడాది దోహాలో తాలిబన్లతో తమ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంకు సంబంధించి పలు అంశాలలో అమెరికా భారత్ ను పరిగణలోకి తీసుకోలేదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విచారం వ్యక్తం చేశారు. అఫ్గాన్‌ గడ్డను ఉగ్ర అడ్డాగా మార్చకూడదన్న అంశంతో పాటు పలు అంశాల్లో భారత్, అమెరికాల మధ్య సామ్యాలున్నప్పటికీ భారత్ ను సంప్రదించగా పోవడం పట్ల ఆయన పరోక్షంగా అసంతృత్తి వ్యక్తం చేశారు. 

భారత్ – అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్‌ సమావేశంలో ఆయన ఆన్‌లైన్‌ ద్వారా ప్రసంగిస్తూ కీలకమైన అంశాలపై నిర్ణయాలకు ముందు ఆచితూచి వ్యవహరించాలని అమెరికాకు హితవు చెప్పారు.  కానీ సదరు ఒప్పందంలో ఏముందో పూర్తిగా అంతర్జాతీయ సమాజంలో ఎవరికీ తెలియదని పేర్కొంటూ ఈ విషయంలో అమెరికా అంత గోప్యం ఎందుకు పాటిస్తుందో అంటూ విస్మయం వ్యక్తం చేశారు. 

అఫ్గాన్‌లో సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడుతుందా? మైనార్టీల హక్కులకు రక్షణ కలుగుతుందా? అని ఆయన నేరుగా అమెరికాను ప్రశ్నించారు.  అలాంటి ఒప్పందాలు విసృతమైనవిగా ఉండాలని, కానీ ఏం జరుగుతుందో అంతా చూస్తున్నారని అంటూ పరోక్షంగా అమెరికా వైఖరిని తప్పుబట్టారు.

అఫ్గానిస్తాన్‌లో జరిగిన, జరుగుతున్న పరిణామాలు ఈ ప్రాంతం మొత్తంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని తెలిపారు. అఫ్గాన్‌లో పరిణామాల ప్రభావం దగ్గరగా ఉన్నందున తమపై ముందుగా, అధికంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే సరిహద్దు తీవ్రవాదానికి తాము బాధితులమని గుర్తు చేశారు. 

అఫ్గాన్‌లో సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు కావడం, అఫ్గాన్‌ గడ్డపై ఎలాంటి ఉగ్రమూకలు నివాసం ఏర్పరుచుకోకుండా జాగ్రత్త వహించడమే ప్రస్తుతానికి భారత్ కు కావాల్సిన అంశాలని జైశంకర్ చెప్పారు. అఫ్గాన్‌లోని కొత్త ప్రభుత్వాన్ని గుర్తించడంలో భారత్ కు  ఎలాంటి తొందర లేదని స్పష్టం చేశారు. 

ఆఫ్గనిస్తాన్ లోని పరిణామాలపై భారత్ తో సహా ప్రపంచ దేశాల ఆందోళనలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆగష్టు లో ఆమోదించిన తీర్మానంలో స్పష్టంగా పేర్కొన్నట్లు జైశంకర్ గుర్తు చేశారు. అమెరికా – తాలిబన్ల మధ్య జరిగిన ఒప్పందంలోని పలు అంశాలు మిగతా ప్రపంచానికి తెలియక పోవడంతో అక్కడి పరిస్థితులను పరిశీలించి, ఒక నిర్ణయం తీసుకోవడానికి భారత్ కు కొంత సమయం పడుతుందని తెలిపారు. 

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ మధ్య అమెరికా అధ్యక్షుడు జై బిడెన్ తో భేటీ అయినప్పుడు ఆఫ్ఘన్ కు సంబంధించి భారత్ ఆందోళనలను తెలిపారని ఆయన చెప్పారు. సీమాంతర ఉగ్రవాదం పట్ల ఎక్కువగా ప్రభావితం అవుతున్న దేశంగా భారత్ కు ఆఫ్ఘన్ పొరుగున ఉన్న కొన్ని దేశాల పట్ల సొంత అభిప్రాయలు  ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆ అభిప్రాయాలను అమెరికా ఏమేరకు అంగీకరిస్తుందో తెలవలసి ఉన్నదని చెప్పారు. 

ఆఫ్ఘన్ పరిణామాలలో పాకిస్థాన్ పాత్ర గురించి అమెరికా, భారత్ కు దాదాపు ఒకే అభిప్రాయం ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే కొన్ని అంశాలలో రెండు దేశాల అభిప్రాయలు ఒకటి కాదని కూడా తేల్చి చెప్పారు. 

ఉగ్రవాదం ప్రోత్సహించడంపై పాకిస్థాన్ ను ఉమ్మడిగా హెచ్చరించడంపై అమెరికానే తేల్చుకోవాలని భారత విదేశాంగమంత్రి స్పష్టం చేశారు. క్వాడ్‌ను నెగిటివ్‌ ఉద్దేశంతో ఏర్పరచలేదని, చైనాతో తమ దేశాలన్నింటికీ స్థిరమైన సంబంధాలే ఉన్నాయని గుర్తు చేశారు. చైనా ఎదుగుదల ప్రపంచ నియతిపై మౌలిక ప్రభావం చూపగలదని అభిప్రాయపడ్డారు. అందువల్ల ఏదేశానికాదేశం తమ స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా చైనాతో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.