చైనా వృద్ధిపై విద్యుత్ సంక్షోభం వేటు!

ప్ర‌పంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ అయిన చైనాలో తలెత్తిన విద్యుత్ సంక్షోభం  ఆ దేశం వృద్ధి రేట్ పై దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఆ దేశంలో  60 శాతం ఆర్థిక వ్య‌వ‌స్థ ఆధార‌ప‌డే బొగ్గుకు తీవ్ర కొర‌త ఏర్ప‌డ‌టంతో దాని ప్రభావం విద్యుత్  ఉత్ప‌త్తిపై ప్ర‌భావం చూపుతున్నది. దానితో వివిధ రంగాల‌ను కుదేలు చేస్తూ.. డ్రాగ‌న్ వృద్ధి రేటును దెబ్బ తీస్తోంది. 

రికార్డు స్థాయిలో బొగ్గు ధ‌ర‌లు, విద్యుత్ ధరల‌పై ప్ర‌భుత్వ నియంత్ర‌ణ‌లు, క‌ఠిన‌మైన‌ క‌ర్బ‌న ఉద్గారాల ల‌క్ష్యాలు.. ఇలా అన్నీ క‌లిపి దేశంలోని 12కుపైగా ప్రావిన్స్‌లు, ప్రాంతాల్లో అంధ‌కారం నెల‌కొనేలా చేసింది. ఎవర్‌గ్రాండే సంక్షోభం దేశ ఆర్ధిక వ్యవస్థకు పెద్ద షాక్ కలిగించిన సమయంలోనే విద్యుత్ సంక్షోభం తలెత్తడంతో చైనా పాలకులు తికమక పడుతున్నారు. 

దానితో విద్యుత్ వినియోగంపై పెరుగుతున్న డిమాండ్, పెరుగుతున్న బొగ్గు, గ్యాస్ ధరలతో పాటు ఉద్గారాలను తగ్గించడానికి బీజింగ్ కఠినమైన లక్ష్యాలను ఏర్పర్చుకొంటూ ఉండడంతో  విద్యుత్ వినియోగంపై అణచివేత నడుస్తోంది. 

అధికారిక గణాంకాల ప్రకారం సెప్టెంబర్ 2021 లో చైనాలో ఫ్యాక్టరీ కార్యకలాపాలు ఫిబ్రవరి 2020 తర్వాత  అత్యల్పంగా కుంచించుకుపోయాయి. కరోనావైరస్ లాక్‌డౌన్‌లు ఆర్థిక వ్యవస్థను కుంగదీశాయి. విద్యుత్ కోతలపై ఆందోళనలు ప్రపంచ పెట్టుబడి బ్యాంకులు చైనా ఆర్థిక వృద్ధి కోసం తమ అంచనాలను తగ్గించడానికి దోహదం చేశాయి.

దేశంలోని 44 శాతం పారిశ్రామిక కార్యకలాపాలు విద్యుత్ కొరతతో ప్రభావితమయ్యాయని గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేశారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా స‌ర‌ఫరా చేయ‌డానికి ఎల‌క్ట్రానిక్స్ నుంచి జీన్స్ వ‌ర‌కూ.. ఓ త‌యారీ హ‌బ్‌గా వెలుగొందే చైనాలోని గువాంగ్‌డాంగ్‌లోనూ ఇప్పుడు ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయి. విద్యుత్ కోతల కారణంగా  కొన్ని వారాలుగా త‌యారీపై విధించిన ఆంక్ష‌ల‌తో స‌ప్లై చెయిన్ పూర్తిగా దెబ్బ‌తిన్న‌ది.

చాలా వ‌ర‌కూ మెషీన్లను ప‌క్క‌న పెట్టేస్తున్నారు. ప‌ని గంట‌ల‌ను త‌గ్గిస్తున్నారు. స్థానిక గ్రిడ్ల‌పై ఒత్తిడి త‌గ్గించేందుకే ఫ్యాక్ట‌రీలు త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఇలా చేయాల్సి వ‌స్తోంది. అయితే ఇప్ప‌టికే తీసుకున్న ఆర్డ‌ర్ల‌ను స‌ప్లై చేయాల్సి ఉండ‌టంతో ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డానికి నైట్ షిఫ్ట్‌లు చేయించ‌డం, సొంత జ‌న‌రేటర్ల‌ను ఉప‌యోగించ‌డం చేస్తున్నారు.

సగంకు పైగా ప్రావిన్స్ లలో విద్యుత్ సంక్షోభం తీవ్రతరం అవుతూ ఉండడంతో  నెలకొనడంతో  అన్ని కంపెనీలూ ఉత్ప‌త్తిలో ఆల‌స్యం త‌ప్ప‌ద‌ని చెబుతున్నాయి. ఒక విధంగా విద్యుత్ విష‌యంలో చైనా ప్ర‌స్తుతం అసాధార‌ణ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటోంది. క‌నీసం ఇళ్ల‌కైనా ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయాలని  జాతీయ గ్రిడ్ అధికారులు భావిస్తున్నారు.

విద్యుత్ వాడ‌కంలో క‌రోనా మ‌హ‌మ్మారి మునుప‌టి ప‌రిస్థితులు వ‌చ్చిన వేళ చైనా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అదే స‌మ‌యంలో ఆస్ట్రేలియాతో నెల‌కొన్ని రాజ‌కీయ విభేదాల నేప‌థ్యంలో ఆ దేశం నుంచి బొగ్గు దిగుమ‌తుల‌పై ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. ఇది విద్యుత్ ఉత్ప‌త్తిపై మ‌రింత ప్ర‌భావం చూపుతోంది. ఇక వినియోగ‌దారుల‌పై మ‌రీ ఎక్కువ‌గా  విద్యుత్ భారం మోప‌కూడ‌ద‌న్న ఆంక్ష‌లు, పెరిగిపోయిన బొగ్గు ధ‌ర‌లు ప‌వ‌ర్ ప్లాంట్ల‌ను కుదేలు చేస్తున్నాయి. విద్యుత్ సంక్షోభం కార‌ణంగా చైనా ఆర్థిక వృద్ధి కూడా మంద‌గిస్తోంది. ఇప్ప‌టికే గోల్డ్‌మాన్ స‌చ్స్‌, నోమురా సంస్థ‌లు చైనా వార్షిక వృద్ధి అంచ‌నాల‌ను తగ్గించాయి.

మొదటి అర్ధభాగంలో 12.7శాతంగా ఉన్న జిడిపి వృద్ధిని తర్వాత మొత్తం సంవత్సరం వృద్ధి లక్ష్యాన్ని  బీజింగ్ 6 శాతంకు తగ్గించుకొంది. వచ్చే ఫిబ్రవరిలో బీజింగ్‌లో జరిగే శీతాకాల ఒలింపిక్స్‌లో నీలి ఆకాశాన్ని నిర్ధారించడానికి, ఆర్థిక వ్యవస్థను డీ-కార్బనైజ్ చేయడంపై అంతర్జాతీయ సమాజానికి సీరియస్ గా ఉన్నట్టు చూపించడానికి అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ప్రయత్నించడంతో చైనా ఇంధన సంక్షోభం ఎదుర్కోవడానికి పాక్షికంగా కారణం అవుతున్నట్లు కూడా భావిస్తున్నారు. ఈ శీతాకాలంలో గృహాలు,  విద్యుత్ కర్మాగారాలను వేడి చేయడానికి ఉపయోగించే బొగ్గు, గ్యాస్ తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఆర్థిక వ్యవస్థకు ఉంది.