2050 నాటికి అస్సాం అధికారంకై అక్రమ వలసదారుల కుట్ర  

అస్సాంలో అక్రమంగా నివాసం ఏర్పాటు చేసుకున్న వారు  2050 నాటికి అస్సాం అధికారాన్ని కైవసం చేసుకోవడానికి బ్లూప్రింట్ సిద్ధం చేశారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. వీరు వేర్వేరు నియోజకవర్గాల్లో క్రమంగా మెజారిటీ సంఖ్యకు చేరుతున్నారని ఆయన హెచ్చరించారు. తాను ఇంటెలిజెన్స్, ఇతర సంస్థల నివేదికలను చూసి ఈ విషయాన్ని చెప్తున్నానని వెల్లడించారు. 

ధెమజిలో జరిగిన ఓ కార్యక్రమంలో శర్మ మాట్లాడుతూ, కొన్ని వర్గాలు అస్సాంలో అధికారాన్ని చేజిక్కించుకుని, 2050 నాటికి రాష్ట్ర జనాభా తీరును మార్చేందుకు కుట్ర పన్నాయని తెలిపారు. ఇటీవల డరంగ్ జిల్లాలోని సిపఝర్ రెవిన్యూ సర్కిల్‌లో, గోరుఖుటి గ్రామంలో కొందరిని ఖాళీ చేయించడానికి చేసిన ప్రయత్నాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

ఇక్కడ స్థిరనివాసం ఏర్పర్చుకున్న వారిలో అత్యధికులు ఈ ప్రాంతానికి చెందినవారు కాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డల్గావ్, బాగ్‌బోర్ వంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారని ఆయన చెప్పారు. సిపఝర్నియోజకవర్గాన్ని చేజిక్కించుకోవడమే వీరి లక్ష్యమని ఆరోపించారు. వీరు దశలవారీగా భూములను ఆక్రమించుకుంటారని, హోజాయ్ జిల్లాలోని లండింగ్, సోనిట్‌పూర్‌లోని బర్చల్లా కూడా వీరి జాబితాలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే వీరు నాగావున్ జిల్లాలోని బటడ్రోబా నియోజకవర్గాన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. 

ప్రతి ఐదేళ్ళకు ఒకసారి వీరు ఓ ప్రాంతంలోని జనాభాను మార్చడానికి ప్రయత్నిస్తున్నారని శర్మ చెప్పారు. ఇంటెలిజెన్స్, ఇతర సంస్థల నివేదికలను తాను చూశానని, వీరు అస్సాంలో అధికారాన్ని 2050నాటికి స్వాధీనం చేసుకోవడానికి కచ్చితమైన బ్లూప్రింట్‌ను సిద్ధం చేశారని ఆయన ప్రకటించారు. 

గొరుఖుటి గ్రామంలో నివసిస్తున్న 10,000 మందిలో 6,000 మంది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్‌సీ)లో తమ పేర్లు నమోదు చేయించుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి సహజసిద్ధ స్థానికులకు అన్ని రకాల పత్రాలు ఉన్నాయని, వీరి పేర్లు ఎన్ఆర్‌సీలో కూడా ఉన్నాయని చెప్పారు. 

వీరి పునరావాసం కోసం ఆరు బిఘాల ప్రభుత్వ భూమిని సిఫజార్ ఏరియాలో ఇస్తామని చెప్పారు. కానీ చాలా మంది ఇతరులు తమకు డల్‌గావున్, బాగ్‌బోర్, ఇతర చోట్ల భూములు  ఉన్నప్పటికీ, సిపఝర్ ఏరియాలో ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారని చెప్పారు. ఇది రాజకీయ పన్నాగమని తెలిపారు.