విమానాలు నడపమని తాలిబన్లు భారత్ కు లేఖ

ఆఫ్ఘ‌నిస్థాన్‌లో మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తాలిబ‌న్లు తొలిసారి భార‌త ప్ర‌భుత్వానికి అధికారికంగా ఓ లేఖ రాశారు. రెండు దేశాల మ‌ధ్య విమానాల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని ఆ లేఖ‌లో తాలిబ‌న్లు కోరారు. ది  ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘ‌నిస్థాన్ పేరుతో ఈ లేఖ వ‌చ్చింది. డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ అరుణ్ కుమార్‌కు తాలిబ‌న్లు ఈ లేఖ‌ను పంపించారు. ఆఫ్ఘ‌నిస్థాన్ పౌర విమానయాన శాఖ తాత్కాలిక మంత్రి అల్హాజ్ హ‌మీదుల్లా అకున్‌జ‌దా ఈ లేఖ‌ను రాశారు. సెప్టెంబ‌ర్ 7వ తేదీన ఈ లేఖ రాసిన‌ట్లుగా ఉంది.

“మీకు తెలిసే ఉంటుంది ఈ మ‌ధ్య అమెరికా బ‌ల‌గాలు తిరిగి వెళ్లిపోయే స‌మ‌యంలో కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ను దెబ్బ‌తీశారు. అయితే ఖ‌తార్ సాంకేతిక సాయంతో ఎయిర్‌పోర్ట్‌ను పున‌రుద్ధ‌రించాము. ఈ మేర‌కు ఎయిర్‌మెన్‌కు నోటీసును ఈ నెల 6న జారీ చేశాము” అని ఆ లేఖ‌లో హ‌మీదుల్లా రాశారు. 

దీనిని దృష్టిలో ఉంచుకొని భారత్, ఆఫ్ఘ‌నిస్థాన్ మ‌ధ్య విమానాల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని కోరారు. “రెండు దేశాల మ‌ధ్య ప్ర‌యాణం సాఫీగా సాగాల‌న్న ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నాము. మా అధికారిక ఎయిర్‌లైన్స్ అయిన అరియానా ఆఫ్ఘ‌న్ ఎయిర్‌లైన్‌, కామ్ ఎయిర్ త‌మ విమానాల‌ను తిరిగి ప్రారంభించాల‌ని అనుకుంటున్నాయి. వారి వాణిజ్య విమానాలు వ‌చ్చేలా ఏర్పాట్లు చేయాల‌ని కోరుతున్నాము” అని ఆ లేఖ‌లో హ‌మీదుల్లా కోరారు.

 ఈ మేరకు తాలిబన్‌ ప్రభుత్వం ఒక లేఖ పంపించారని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల అఫ్గనిస్తాన్‌ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో కాబూల్‌కి అన్ని వాణిజ్య  విమానాలను భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. భారత దేశం కాబూల్‌కు చిట్ట చివరిగా ఆగస్టు 21న విమానాన్ని నడిపింది. భారత వాయు సేన విమానంలో భారత పౌరులను కాబూల్ నుంచి తీసుకొచ్చింది.

ఆర్థిక సంకోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గనిస్తాన్‌ని గట్టెక్కించే చర్యల్లో భాగంగా తాలిబన్‌ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది. అయితే తాలిబన్‌ ప్రభుత్వం గతవారం కూడా పలు దేశాలతో విమానయన సేవలను పునరద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే భారత్‌కు కూడా లేఖ రాసింది. 

ఈ విషయమై తాలిబన్ల ప్రతినిధి అబ్దుల్‌ కహార్‌ బాల్కి స్పందిస్తూ.. అంతర్జాతీయ విమానయాన సేవలను నిలపివేయడంతో విదేశాల్లో చిక్కుకున్న అఫ్గన్‌లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రయాణాలు లేకపోతే ప్రజలకు ఉపాధి, చదువు సజావుగా కొనసాగదని స్పష్టం చేశారు. తాలిబన్లు అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత అంతర్జాతీయ స్థాయిలో సెప్టెంబర్‌ 13వ తేదీన కాబూల్‌ వెళ్లిన మొదటి కమర్షియల్‌ విమానం పాకిస్తాన్‌కు చెందినదే కావడం గమనార్హం.