అక్టోబర్ 30న హుజురాబాద్, బద్వేల్ పోలింగ్

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠకు తెరలేపుతున్న హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. వచ్చే నెల 30 హుజురాబాద్ ఉప ఎన్నిక జరుగనుంది. అదే రోజున ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని బద్వేల్ ఉపఎన్నిక కూడా జరుగనున్నది. 

అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు అక్టోబర్ 8 వరకు గడువు ఉంటుంది. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. అక్టోబర్ 13న నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అవుతుంది. అక్టోబర్ 30(శనివారం)న ఎన్నికల పోలింగ్ జరుగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరుగగా.. అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి.

జూన్ 4న ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దాన్ని అసెంబ్లీ స్పీకర్ 12న ఆమోదించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక ఎప్పుడెప్పుడా అంటూ తీవ్రమైన ఉత్కంఠ కొనసాగుతోంది. దాదాపు మూడు నెలలుగా హుజురాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. 

కానీ ఉప ఎన్నికల షెడ్యూల్ ఆలస్యమవుతుండటంతో ఎన్నిక ఎప్పుడా అనే ఆసక్తి నెలకొంది. దేశ వ్యాప్తంగా పండుగలు ఉన్న నేపథ్యంలో కరోనా తీవ్రత పెరిగే అవకాశం ఉందంటూ వచ్చిన నివేదికలతో ఎన్నికలను కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది. 

ఎట్టకేలకు వచ్చే నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఇన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు కేంద్ర ఎన్నికల సంఘం తెరదించింది.  ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఇప్పటి నుంచి హుజురాబాద్‌లో రాజకీయం మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 ఇక దేశ వ్యాప్తంగా మ‌రో 28 అసెంబ్లీ, 3 లోక్‌స‌భ‌ నియోజ‌క‌వ‌ర్గాల ఉప ఎన్నిక‌ల‌కు కూడా ఇదే షెడ్యూల్ వ‌ర్తించ‌నుంది. మధ్యప్రదేశ్ లోని ఖండ్వా, హిమాచల్ ప్రదేశ్ లోని మండి లతో పాటు దాద్రా, నగర్ హవేలీ లోక్ సభ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరుగనున్నాయి. అస్సాంలో 5, పశ్చిమ బెంగాల్ లో 4, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయాలలో 3 చొప్పున;  బీహార్, కర్ణాటక,  రాజస్థాన్ లలో 2 చొప్పున;  హర్యానా,  మహారాష్ట్ర, మిజోరాం, నాగాలాండ్ లలో 1 చొప్పున అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉపఎన్నికలు జరుగనున్నాయి..