తెలంగాణను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

గులాబ్‌ తుఫాను తెలంగాణ రాష్ట్రంపై తీవ్రంగా ప్రభావం చూపింది. రెడ్‌అలర్ట్‌ జారీ అయిన జిల్లాల్లో రోజంతా అయితే కుండపోత.. లేదంటే ముసురు అన్నట్లుగా వరణుడు ప్రతాపం చూపాడు. వాతావరణశాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమవడంతో ఒకట్రెండు చోట్ల మినహా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు.

అసెంబ్లీ, మండలి సమావేశాలను వర్షాల వల్ల  మూడు రోజులు వాయిదా వేశారు. తిరిగి అక్టోబర్​ 1న పొద్దున 10 గంటలకు రెండు సభలు ప్రారంభం కానున్నాయి. భారీ వర్షాల కారణంగా మంగళవారం రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ప్రకటిస్తున్నట్లు  సీఎస్  సోమేశ్‌ తెలిపారు.

ఏడు రెడ్‌అలర్ట్‌ జిల్లాల్లో 10 సెం.మీ మించి వర్షపాతం నమోదైంది. ఒకటి రెండు జిల్లాల్లో తప్ప రాష్ట్రమంతా భారీగా వర్షాలు పడ్డాయి. అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లు, కాలనీలు చెరువులను తలపించాయి. కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. చెట్లు, కరెంట్‌‌‌‌‌‌‌‌ స్తంభాలు నేలకొరిగాయి.

గులాబ్ తుపాను ప్రభావంతో మంగళవారం నుంచి రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా మంగళవారం ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

గులాబ్  ఎఫెక్ట్ తో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితిపై గవర్నర్ తమిళి సై ఆరా తీశారు. సోమవారం సీఎస్ సోమేశ్ కుమార్ కు ఫోన్ చేసి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నందున 24 గంటలూ అలర్ట్ గా ఉండాలని గవర్నర్ ఆదేశించారు. 

అన్ని జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ ​టీంలను సిద్ధంగా ఉంచామని, కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశామని గవర్నర్‌‌కు సీఎస్ తెలిపారు. సహాయక చర్యలు చేపట్టేందుకు రెస్క్యూ టీంలు సిద్ధంగా ఉన్నాయన్నారు. అధికారులను రౌండ్ ది క్లాక్ అలర్ట్ గా ఉంచుతూ, మానిటర్ చేయాలని సీఎస్ ను గవర్నర్ ఆదేశించారు.

భారీ వర్షాలు కురుస్తున్నందున ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. రాష్ట్రంలో పరిస్థితులపై సోమవారం ఢిల్లీ నుంచి సీఎస్‌‌‌‌‌‌‌‌ సోమేశ్​ కుమార్‌‌‌‌‌‌‌‌తో రివ్యూ నిర్వహించారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అలర్ట్​గా ఉండాలని సూచించారు. 

అనంతరం జిల్లా కలెక్టర్లతో సీఎస్‌‌‌‌‌‌‌‌ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, సమాచారాన్ని సెక్రటేరి యట్‌‌‌‌‌‌‌‌లోని కంట్రోల్ రూంకు అందించాలన్నారు. కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని కమిషనర్లు, ఎస్పీలను డీజీపీ మహేందర్‌‌రెడ్డి ఆదేశించారు.

హైదరాబాద్​ను వాన ముంచెత్తింది. సోమవారం మబ్బుల నుంచి రాత్రి వరకు రికాం లేకుండా కురిసింది.  జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోని వాళ్లు బిక్కుబిక్కుమంటు గడిపారు. వానకు తోడు వరద పోటెత్తింది. గల్లీల్లోకి మోకాళ్లలోతు నీళ్లు చేరడంతో బయటకు వచ్చే దారి లేక జనం తిప్పలు పడ్డారు. మెయిన్​ రోడ్లు కూడా చెరువులను తలపించాయి. 

ఎక్కడికక్కడ ట్రాఫిక్​ జామ్​లు ఏర్పడ్డాయి. గులాబ్​ తుఫాను​ ఎఫెక్ట్​ వల్ల హైదరాబాద్​తోపాటు దాదాపు రాష్ట్రమంతా వర్షాలు కురిశాయి. ఖమ్మం, కొత్తగూడెం, ఆదిలాబాద్​, మహబూబాబాద్​, వనపర్తి, వరంగల్​, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ఊర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. పొట్టకొచ్చిన వరి పొలాలు నీటమునిగాయి. 

హైదరాబాద్​లో 150 కాలనీలు, బస్తీల్లోకి భారీగా వరద నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎల్బీనగర్​, ఖైరతాబాద్​, బోడుప్పల్​, నాగోల్​లోని పలు కాలనీల్లో వందకుపైగా ఇండ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు.  మెయిన్​ రోడ్లు కూడా చెరువులను తలపించాయి.  హైటెక్​ సిటీ, సికింద్రాబాద్​, మాదాపూర్​, బంజారాహిల్స్​, టోలిచౌకి, అత్తాపూర్ లాంటి ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు నీరు నిలిచింది. మరో రెండు రోజులు అలర్ట్​గా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది.