గడ్డిపోచలాగా పీకేస్తా మనుకొంటే… గడ్డపారలాగా నిలబడ్డా

“నన్ను  గడ్డిపోచలాగా పీకేస్తామని అనుకున్నారు.. కానీ నేను గడ్డపారలాగా నిలబడ్డా”నని మాజీ మంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్ తెలిపారు. తన గొంతు నొక్కాలని, తన ముఖం అసెంబ్లీలో కనిపించకూడదన్న కుతంత్రాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తన అల్లుడు హరీశ్ రావును హుజురాబాద్ లో పెట్టి.. ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. 
 
హనుమకొండ కమలాపూర్ మండలంలో జరిగిన పెరిక కుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటూ పీడిత ప్రజల పక్షాన వినిపించే తన గొంతు మూగపోవాలన్న నీచమైన కుట్రలో భాగంగా హరీశ్ రావు, ఎమ్మెల్యే ధర్మారెడ్డి లాంటి వాళ్లంతా ఇక్కడ వాటిని అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 
 
“నేను భయపడేవాన్ని కాదు… ఆకారంలో చిన్నోన్ని కావచ్చు.. కానీ నా గుండె ధైర్యం, నిబ్బరం పెద్దది” అని రాజేందర్ స్పష్టం చేశారు. అందరినీ ఖతం చేసినట్లే తనను కూడా ఖతం చేస్తే మరో 20 ఏళ్లు తనకు ఎదురు ఉండదని కేసీఆర్ అనుకుంటున్నాడని చెప్పారు. నాలుగున్నర నెలలుగా నాలాంటి బక్కపల్చటి బిడ్డమీద ఇంతమంది మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కుట్రలుచేస్తున్నారని వాపోయారు. 
 
లారీల్లో లిక్కరు బాటిళ్లు, ఆహారం తెచ్చి ఊర్లను ఊర్లు బార్లుగా మార్చారని దుయ్యబట్టారు. తెలంగాణలో దసరా రెండు రోజులొస్తే.. హుజురాబాద్ లో మాత్రం మూడు నెలలుగా దసరా నడుస్తోందని ఈటెల ఎద్దేవా చేశారు. ఇక్కడి యువకులకు మద్యం తాగించడం అలవాటు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేల తీరు చూసి హుజురాబాద్ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని తెలిపారు. 

మా దగ్గరున్న సర్పంచులకు బిల్లులు రిలీజ్ చేసినట్లుగా.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అందరి సర్పంచుల బిల్లులు రిలీజ్ చేయాలని రాజేందర్ డిమాండ్ చేశారు. ఓట్ల  కోసమే హుజురాబాద్ సర్పంచులకు రావాల్సిన బిల్లులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. హరీశ్ రావు రాత్రి పూట పల్లెల్లో అడ్డాలు పెట్టి.. నాతో తిరిగేవాళ్లను కలిసి టీఆర్ఎస్ లోకి రావాలని ప్రలోభపెడుతూ.. బేరాలాడుతున్నాడని ఆరోపించారు. 

హరీశ్ ఒకప్పుడు మాట్లాడితే తెలంగాణ పులకించిపోయేది… ఆయన ఇప్పుడు ఎంతకు దిగజారాడో చూస్తున్నారని రాజేందర్ విచారం వ్యక్తం చేశారు. కేసీఆర్ పంపిస్తే.. తన ఉద్యమ సహచరున్నైన తనను బొందపెట్టాలని హరీశ్ చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. 

వాళ్లు పంచుతున్న డబ్బుల వెనక, ఇస్తున్న పథకాల జీవో వెనక ప్రజల మీద ప్రేమలేదు.. కేవలం ఓట్లు పొందాలనే కుట్ర ఉందని ఆరోపించారు. నిన్నటి వరకు నాతో కలిసి తిరిగినోడు, కలిసి తిన్నోడు.. తెల్లారితే వాళ్ల దగ్గరికి పోతున్నారు. నాతో తిరగడం వల్లే నాయకుల ధర పెరుగుతోందని.. ధర చెల్లించి వాళ్లను కొనుక్కుపోతున్నారని పేర్కొన్నారు. 

హుజురాబాద్ లో రూ 200 కోట్లు ఖర్చు చేసే శక్తి మీకు ఎలా వచ్చింది? మీది అక్రమ సంపాదన కాదా” అని తెలంగాణ సమాజం మిమ్మల్ని అడగబోతోందని హెచ్చరించారు. అంతేకాదు ఖచ్చితంగా ఈ సమాజం.. కేసీఆర్ ను బోనులో నిలబెట్టి తీరుతుందని, ఈ ఉచ్చునుంచి తప్పించుకోలేరని ఈటెల హెచ్చరించారు.