దళిత బంధు పథకాన్ని రాష్ట్రమంతా అమలు చెయ్యాలి

దళిత  బంధు  పథకాన్ని  రాష్ట్ర  వ్యాప్తంగా  అమలు  చెయ్యాలని, దళితులకు  ఇచ్చిన    హామీలను  నెరవేర్చాలని  కోరుతూ   ముఖ్యమంత్రి  కెసిఆర్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఐదు పేజీల   బహిరంగ  లేఖ  వ్రాసారు. 
 
దళితులు  సంక్షేమ  పట్ల  చిత్తశుద్ధి  ఉంటే  దళిత  బంధు  పథకాన్ని  రాష్ట్ర  వ్యాప్తంగా  అమలు  చేసి అర్హులకు  రూ 10 లక్షల  ఆర్ధిక  సహాయం  అందించాలని స్పష్టం చేశారు. దళితుని  ముఖ్యమంత్రి  చేస్తానని చెప్పిన  కెసిఆర్  దళితులను  నిట్టనిలువునా  మోసగించారని  బహిరంగ  లేఖలో  విమర్శించారు.
కనీసం  దళితులకు  మంత్రి  వర్గంలో కూడా  తగిన  ప్రాధాన్యత  కెసిఆర్  ఇవ్వడం  లేదని  ధ్వజమెత్తారు. 2014, 2018 అసెంబ్లీ  ఎన్నికలు  సందర్భంగా  దళితులకు  తెరాస  పార్టీ, ముఖ్యమంత్రి  కెసిఆర్  ఇచ్చిన  ప్రతీ  ఒక్క  హామీ  నెరవేర్చాలని సంజయ్ స్పష్టం చేశారు. మాల   సామాజికి   వర్గంకు  మంత్రి  వర్గంలో  స్థానం  ఇస్తే  మాదిగ  సామజిక  వర్గంకు   ఇవ్వకుండా  దళితులను  కెసిఆర్  మోసగిస్తున్నారని విమర్శించారు. మాదిగ , మాల  సామాజిక  వర్గాల  ఆత్మ  గౌరవ    భవనాలకు  భూమి  ఎప్పుడు  కేటాయిస్తారని కేసీఆర్ ను ప్రశ్నించారు.
125 అడుగుల  అంబేద్కర్  విగ్రహం ఏర్పాటుకు, అంబేద్కర్  టవర్స్  కు   అయిదు  సంవత్సరాలు  క్రితం శంకుస్థాపన చేసినా   ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని సంజయ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి  కెసిఆర్   ఈ  ఏడు   సంవత్సరాలలో  ఒక్కసారి  కూడా  ఫార్మ్  హౌస్, ప్రగతి  భవన్  దాటి  బయటకు  వచ్చి  డాక్టర్  బాబా  సాహెబ్  అంబేద్కర్  కు  దండ  వేయ్యలేదని ఆయన గుర్తు చేశారు.
 
దళితులకు  మూడు  ఎకరాల  భూమి  ఇస్తానని చెప్పి  దళితులను  కెసిఆర్  నిట్టనిలువునా  మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు , గిరిజనులకు  మూడు  ఎకరాలు  భూమి  ఇవ్వలిసిందే అని స్పష్టం చేశారు. ఎస్సీ , ఎస్టీ  సబ్ ప్లాన్  నిధులను  దారి  మల్లించి  దళితులకు  కెసిఆర్  ద్రోహం  చేస్తున్నారని సంజయ్ విమర్శించారు.
ఎస్సీ , ఎస్టీ  సబ్ ప్లాన్ నిధులను  స్వతంత్ర  నోడెల్  ఏజెన్సీ  ద్వారా  ఖర్చు  చెయ్యాలని  డీమాండ్ చేశారు. యస్సీ  కార్పొరేషన్  రుణాలు  కోసం  లక్షల  మంది  దళిత  యువతీ , యువకులు  ఎదురుచూస్తున్నారని చెబుతూ వారికీ  వెంటనే  రుణ  సదుపాయం  కలిపించాలని కోరారు.  ఎస్సీ , ఎస్టీ   బ్యాక్  లాగ్  పోస్టులను  వెంటనే  భర్తీ  చెయ్యాలని,  దళితులపై  జరుగుతున్న  దాడులు , అత్యాచారాలు అరికట్టాలని సంజయ్ కేసీఆర్ ను డిమాండ్ చేశారు.