ప్రతి భారతీయుడికి డిజిటల్‌ హెల్త్‌ ఐడి

ప్రతి భారతీయుడు ఇప్పుడు డిజిటల్‌ హెల్త్‌ ఐడిని పొందుతారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ను ప్రారంభించిన ప్రధాని పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య చికిత్సను అందించడంలో ఎదురయ్యే సమస్యను ఇది పరిష్కరిస్తుందని భరోసా వ్యక్తం చేశారు. 
 
ఈ పధకం కింద ప్రతి భారతీయుడికి డిజిటల్‌ హెల్త్‌ ఐడిని ఇవ్వనున్నట్లు తెలిపారు. డిజిటల్‌ హెల్త్‌ ఎకో సిస్టమ్‌లో ఈ మిషన్‌ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రతి ఒక పౌరుడి హెల్త్‌ రికార్డు డిజిటల్‌ పద్ధతిలో సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు. డిజిటలైజేషన్‌ వల్ల ఆరోగ్య నియంత్రణ మరింత సులభం అవుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
టెక్నాలజీ ఆధారంగా.. ఆయుష్మాన్‌ భారత్‌ రోగుల సేవల గురించి దేశవ్యాప్తగా అన్ని హాస్పిటళ్లకు విస్తరిస్తుందని ప్రధాని వెల్లడించారు. సాంకేతికంగా బలమైన ఫ్లాట్‌ఫామ్‌తో సులభమైన వైద్య చికిత్స వీలవుతుందని చెప్పారు. డిజిటల్‌ మౌలిక సదుపాయాలు భారత్‌లో భారీ స్థాయిలో ఉన్నాయని, దేశంలో యూపీఐ విధానంలో అన్ని పనులు జరుగుతున్నాయని ప్రధాని తెలిపారు. 
 
మన దేశంలో 118 కోట్ల మంది మొబైల్‌ వినియోగదారులు ఉన్నారని, 80 కోట్ల మంది ఇంటర్నెట్‌ యూజర్లు ఉన్నారని, 43 కోట్ల మందికి జన్‌ధన్‌ అకౌంట్లు ఉన్నాయని తెలుపుతూ ఇలాంటి భారీ డిజిటిల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏ దేశంలోనూ లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉచిత వ్యాక్సిన్‌ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా 90 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను ఇచ్చామని, దీంతో ఓ రికార్డును క్రియేట్‌ చేశామని ప్రధాని తెలిపారు. టీకాలు తీసుకున్నవారందరికీ సర్టిఫికేట్లు ఇచ్చామని, ఈ ఘనతలో కోవిన్‌ పోర్టల్‌ పాత్ర కీలకమైందని మోదీ  ప్రశంసించారు. 
 
భారతీయ వైద్య ఆరోగ్య రంగంలో కల్పించే సదుపాయాల అంశంలో ఆయుష్మాన్‌ డిజిటిల్‌ మిషన్‌ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని మోదీ పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రారంభిచామని, ఇప్పుడు డిజిటల్‌ మిషన్‌ ప్రారంభించడం సంతోషంగా ఉందని ప్రధాని తెలిపారు.

సోమవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం అని, ఎక్కువ మంది వ్యాక్సిన్‌ తీసుకుంటే, అప్పుడు పర్యాటికులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తారని ప్రధాని చెప్పారు. అందుకే హిమాచల్‌ ప్రదేశ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా జరుగుతోందని తెలిపారు. 
డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.  వ్యాక్సినేషనైనా లేక కోవిడ్‌ చికిత్స అయినా, వైద్య సిబ్బంది సహాయం వల్లే కరోనా పోరాటంలో భారీ ఊరట దక్కిందని ప్రధాని స్పష్టం చేశారు.
 
దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ అమలు చేయబోతున్నట్లు గత ఏడాది ఆగస్టు 15న ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రస్తుతం ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలు అండమాన్ & నికోబార్, చండీగఢ్, దాద్రా & నాగర్ హవేలీ మరియు డామన్ & డయు, లడఖ్, లక్షద్వీప్ & పుదుచ్చేరిలలో టెస్ట్ రన్ చేస్తున్నారు. పిఎమ్-డిహెచ్ఎమ్(ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్) కింద దేశంలోని పౌరులందరికీ హెల్త్ కార్డులతో పాటు హెల్త్ ఐడీ కూడా అందిస్తారు. ఇది బ్యాంక్ ఖాతా ఎలా పనిచేస్తుందో? అలాగే, వారి ఆరోగ్యానికి సంబంధించి ఒక ఖాతాగా పనిచేస్తుంది. దీని ఆధారంగా ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేస్తారు.
 
భవిష్యత్తులో ఎప్పుడైనా జబ్బు చేసినప్పుడు చికిత్స అందించాల్సి వచ్చినా, మందులు తీసుకోవాల్సి వచ్చినా దానికి ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీరు ఏదైనా ఆసుపత్రికి వెళ్లినప్పుడు మీ హెల్త్ ఐడీ నమోదు చేయగానే స్వయం చాలకంగా మీ పూర్తి ఆరోగ్య సమాచారం డాక్టర్లకు కనిపిస్తుంది. ఒకవేల కొత్త పరీక్షలు చేయాల్సి వస్తే ఆ వివరాలను ఇందులో చేరుస్తారు.