ఆఫ్ఘన్ మీడియాపై తాలిబన్ల ఆంక్షలు… 150 సంస్థలు మూత 

ఆఫ్ఘనిస్థాన్‌లో మీడియా స్వేచ్ఛను అణచివేసేందుకు తాలిబన్లు కొత్త నిబంధనలను ప్రకటించారు. ఇస్లాంకు వ్యతిరేకమైన, జాతీయ స్థాయి నేతలకు అవమానకరమైన అంశాలను ప్రచురించరాదని పేర్కొన్నారు. ప్రభుత్వ మీడియా కార్యాలయాలతో సమన్వయం కుదుర్చుకుని వార్తలను, ఫీచర్లను రాయాలని పాత్రికేయులను ఆదేశించారు. 
 
ఈ మేరకు న్యూస్ ఆర్గనైజేషన్లకు 11 నిబంధనలను ప్రకటించారని అమెరికన్ మీడియా తెలిపింది. అమెరికన్ మీడియా కథనం ప్రకారం, ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రభుత్వం కుప్పకూలినప్పటి నుంచి దాదాపు 150 మీడియా సంస్థలు మూతపడ్డాయి. రోజువారీ కార్యకలాపాలు నిర్వహించలేక ఈ సంస్థలను మూసేశారు. మీడియాకుగల సమాచార హక్కులో తాలిబన్లు నిరంతరం జోక్యం చేసుకోవడమే దీనికి కారణం.
కొన్ని దిన పత్రికలు ముద్రణను నిలిపేసి, కేవలం ఆన్‌లైన్‌లోనే తమ పత్రికలను ప్రచురిస్తున్నాయి. దేశంలో అకస్మాత్తుగా ఆర్థిక వ్యవస్థ తలక్రిందులు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అమెరికాలోని ప్రెస్ ఫ్రీడం ఆర్గనైజేషన్ సీనియర్ మెంబర్ స్టీవెన్ బట్లర్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్‌లో పాత్రికేయులు భయపడుతున్నారని చెప్పారు.
సహాయం కోరుతూ వందలాది ఈ-మెయిల్స్ ఆఫ్ఘన్ పాత్రికేయుల నుంచి తమకు వస్తున్నాయని పేర్కొన్నారు. మానవీయ విలువలను గౌరవిస్తామని ఇచ్చిన హామీని తాలిబన్లు నిలబెట్టుకోవడం లేదని స్థానిక పాత్రికేయులు ఆరోపిస్తున్నారు. పాత్రికేయులను నిరంతరం వేధిస్తున్నారని, చంపుతున్నారని పేర్కొన్నారు. 
 
తాలిబన్ల వశంలోకి ఆఫ్ఘనిస్థాన్ వెళ్ళినప్పటి నుంచి ప్రైవేట్ టీవీ చానళ్ళలో ప్రసారాల తీరు మారిపోయింది. విమర్శలు, రాజకీయ చర్చలు, వినోదం, సంగీతం, విదేశీ సీరియల్స్ వంటివాటికి బదులుగా తాలిబన్ ప్రభుత్వానికి అనుకూలమైన అంశాలను ప్రసారం చేస్తున్నాయి.