శ్రీరాముడి బస ఆధారంగా కొత్త టూరిజం సర్క్యూట్‌

ఛత్తీస్‌గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా శ్రీరాముడితో సంబంధం గల ప్రదేశాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడం పట్ల దృష్టి సారిస్తున్నది.   ప్రతిష్టాత్మక ‘రామ్ వన్ గమన్ టూరిజం సర్క్యూట్’ ప్రాజెక్ట్‌ను వచ్చే నెలలో ప్రారంభించనున్నది. అక్టోబర్ 7 న నవరాత్రి పండుగ ప్రారంభాన్ని పురస్కరించుకుని ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

 2021 సంవత్సరానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలలో భాగంగా ఈ ప్రాజెక్టును తీసుకొస్తున్నారు. ‘బాత్ హై అభిమాన్ కీ, ఛత్తీస్‌గఢ్ కే స్వాభిమాన్ కీ’ అనే నినాదంతో ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ ప్రభుత్వం అభివృద్ధిని కొనసాగిస్తున్నది. పురాణాల ప్రకారం, ప్రవాస జీవితంలో భాగంగా రాముడు, లక్ష్మణుడు, సీత.. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో నివసించారు.

రాముడి స్ఫూర్తితో చత్తీస్‌గఢ్‌లో అనేక కథలు, పాటలు అందుబాటులో ఉన్నాయి. రాముడి నానిహాల్ (తల్లి జన్మస్థలం) అని ఛత్తీస్‌గఢ్‌ ప్రజలు గట్టిగా నమ్ముతారు. అలాగే, ఛత్తీస్‌గఢ్‌లో రాముడు యువరాజుగా మర్యాద పురుషోత్తముడిగా రూపాంతరం చెందాడని చెప్తుంటారు. ‘రాముడు అయోధ్య నుంచి వనవాసానికి వచ్చిన సమయంలో ఎక్కువ సమయం ఛత్తీస్‌గఢ్‌లో గడిపాడు.

రాముడు, మాత కౌశల్యతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలను కాపాడటానికి, భక్తులు, పర్యాటకులు ‘రామ్ వన్ గమన్’ టూరిజం సర్క్యూట్‌లో వేసే ప్రతి అడుగులోనూ దైవత్వం సారాంశాన్ని అనుభవించేలా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం రూపొందించింది’ అని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్‌ చెప్పారు.

రాయ్‌పూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్‌ఖురి గ్రామంలో ఉన్న పురాతన కౌసల్య మాత మందిరంలో సర్క్యూట్‌ ప్రారంభోత్సవం జరుగుతుంది. ప్రారంభ వేడుకలో సంగీతం, నృత్యం, లేజర్ షో, చత్తీస్‌గఢ్‌లో రాముడు, అతడి ప్రవాస కథను వర్ణించే ఎల్‌ఈడీ మ్యాపింగ్ తదితరాలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.