చీరలో వచ్చిన మహిళను అనుమతించని రెస్టారెంట్‌

మహిళలు చీరలు ధరించడం భారతీయ సంప్రదాయం. అయితే చీరలో వచ్చిన ఒక మహిళను రెస్టారెంట్‌ సిబ్బంది లోనికి అనుమతించలేదు. ఆమె వస్త్రధారణ స్మార్ట్‌ క్యాజువల్‌ డ్రెస్‌ కోడ్‌ కిందకు రాదంటూ రెస్టారెంట్‌లోకి రాకుండా ఆమెను అడ్డుకున్నారు. దీంతో చీర ధరిస్తే రెస్టారెంట్‌లోనికి అనుమతించకూడదన్న డ్రెస్‌ కోడ్‌ గురించి తనకు చూపించాలని ఒక మహిళ అక్కడి సిబ్బందిని నిలదీసింది.

అయితే ‘మేము స్మార్ట్ క్యాజువల్‌ని మాత్రమే అనుమతిస్తాము. చీర స్మార్ట్ క్యాజువల్ కిందకు రాదు’ అంటూ ఒక సిబ్బంది సమాధానమిచ్చాడు.ఈ సంఘటన ఎక్కడో ఐరోపా దేశాలలో జరగలేదు. మన దేశ రాజధాని ఢిల్లీ ఆగస్ట్‌ క్రాంతి మార్గంలోని అన్సల్ ప్లాజాలో ఉన్న అక్విలా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో జరిగిన జరిగింది.

జర్నలిస్ట్ అనిత చౌదరికి ఎదురైన ఈ చేదు అనుభవాన్ని తన ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించి ఓ చిన్నపాటి వీడియోను కూడా ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. దీనిపై ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.ఢిల్లీలోని అక్విలా అనే రెస్టారెంట్‌కు తాను చీర కట్టుకుని అయితే అక్కడి సిబ్బంది తనను లోపలికి అనుమతించలేదని ఆమె వెల్లడించారు.

చెప్పేందుకు చాలా ప్రయత్నించానని, అయినా వాళ్లు వినలేదని, ‘స్మార్ట్ క్యాజువల్’ బట్టల్లోనే రావాలని చెప్పారని, చివరికి తనకు తప్పలేదని వాపోయారు. ‘చీర ధరించే మహిళలను అక్విలా రెస్టారెంట్‌లోకి అనుమతించరు. ఎందుకంటే భారతీయ చీర ఇప్పుడు స్మార్ట్ డ్రెస్‌ కాదు. అసలు స్మార్ట్ డ్రెస్‌కు కాంక్రీట్ నిర్వచనం ఏమిటి? దయచేసి నాకు చెప్పండి. దయచేసి స్మార్ట్ దుస్తుల గురించి నిర్వచించండి. అప్పుడు నేను చీర కట్టుకోవడం మానేస్తాను’ అని ఆమె అందులో పేర్కొన్నారు.

భారతీయ వస్త్రధారణ అయిన చీరలో కనిపిస్తే అమాయకుల్లా చూస్తారని అందుకే తాను చీరలో ఉంటే అనుమతించలేదని అనిత చౌదరి తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ మహిళా కమిషన్‌తోపాటు పలువురికి దీనిని ఆమె ట్యాగ్ చేశారు. మరోవైపు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఈ వీడియోపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ఆ రెస్టారెంట్‌ డ్రెస్ కోడ్ విధానంపై మండిపట్టారు.

ఇది వివక్షతతో కూడిన దారుణ నిబంధన అని ఆరోపించారు. ‘చీర స్మార్ట్‌ డ్రెస్‌ కాదని ఎవరు నిర్ణయించారు?’ అని ట్విట్టర్‌ యూజర్‌ షెఫాలి వైద్య ప్రశ్నించారు. అమెరికా, బ్రిటన్‌, యూఏఈలోని ఉత్తమ రెస్టారెంట్లలో కూడా తాను చీరలు ధరించినట్లు ఆమె చెప్పారు. అక్విలా రెస్టారెంట్ వంటివి భారత్‌లో డ్రెస్ కోడ్‌ను నిర్దేశిస్తాయా అని మండిపట్టారు.

తన తల్లి చీరలో ఆల్ప్స్ పర్వతంపైకి ఎక్కారని, అక్కడ ఎవరూ అభ్యంతరం చెప్పలేదని ఒక యూజర్‌ తెలిపారు. చీరను ధరించిన మహిళను లోనికి అనుమతించని అక్విలా రెస్టారెంట్‌ ఇది చూసి సిగ్గుపడాలంటూ ఆల్ప్స్ పై చీరలో ఉన్న తన తల్లి ఫొటోను ఆమె షేర్‌ చేశారు. మరోవైపు ఈ రెస్టారెంట్‌ విధించిన ఈ నిబంధనపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్విలా రెస్టారెంట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.