జగన్ వ్యాపార సామ్రాజ్యంగా టిటిడి బోర్డు .. హైకోర్టు ఆగ్రహం

కేంద్ర మంత్రివర్గంలో కన్నా ఎక్కువ మంది సభ్యులతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును నియమించడం పలు వివాదాలకు దారితీస్తున్నది. నలుగురు ఎక్స్‌ అఫిషియో సభ్యులతో సహా 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. భారత దేశంలోనే కాదు, బహుశా ప్రపంచంలో మరే ప్రార్థనాస్థలంకు ఇంతటి భారీ పాలకవర్గం ఏర్పాటైన దాఖలాలు లేవు.
 ప్రసిద్ధి చెందిన హిందూ ధార్మిక కేంద్రమైన తిరుమలను వ్యాపార లావాదేవీలలో అక్రమాలకు పాల్పడేవారితో నింపి వేశారనే ఆరోపణలు చెలరేగుతున్నాయి. పైగా, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇతర రాష్ట్రాలకు చెందినవారే కావడం గమనార్హం. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ప్రార్ధన కేంద్రంకు అంత భారీ స్థాయిలో ఇతర రాష్ట్రాల వారిని పాలకవర్గంలో నియమించిన దాఖలాలు లేవు.
టీటీటీ పాలకమండలి సభ్యుల నియామకంపై ఏపీ హైకోర్టు బుధవారం సీరియస్  అయింది. ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసింది. టీటీటీ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించారని వాదనలు జరిగాయి.
టీటీడీ నిర్ణయం సామాన్య భక్తులపై ప్రభావం చూపుతుందని పిటిషనర్ల తరపు న్యాయవాది యలమంజుల బాలాజీ  కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అలాగే దీనిపై టీటీడీ, వైసీపీ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది.
గతంలో టిటిడి పాలకవర్గ సభ్యులంటే కేవలం సమావేశాలకు మాత్రమే హాజరయ్యేవారు.  చివరకు చైర్మన్ కూడా అంతే. కానీ కొంతకాలంగా వారంతా తిరుమలలో తిష్ట వేస్తున్నారు. ప్రతి సభ్యునికి ఒక కొట్టేగే, వారికి ఒకరిద్దరు వ్యక్తిగత సిబ్బందిని కేటాయిస్తున్నారు. వారంతా ప్రత్యేక దర్శనాలకు సిఫార్సులు చేయడంలో మునిగిపోతున్నారు.
కొందరు పాలకవర్గ సభ్యులు ప్రత్యేక దర్శనాలను కోసం భక్తుల నుండి భారీ మొత్తాలు వసూలు చేస్తున్నట్లు కూడా గతంలో ఆరోపణలు వచ్చాయి. ఇక చైర్మన్  అక్కడే మకాం వేసి, రోజువారీ పాలనా వ్యవహారాలపై ఆధిపత్యం వహించే ప్రయత్నం చేస్తున్నారు.
గతంలో ధార్మిక ప్రవృతి కలిగిన వారిని, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేనివారిని టిటిడి బోర్డు చైర్మన్ గా నియమిస్తూ వచ్చారు. కానీ రాజకీయ పదవులు ఇవ్వలేనివారికి రాజకీయ పునరావాసంగా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంల నుండి మార్చివేశారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సహితం కీలక రాజకీయ పదవి ఇవ్వలేక, సొంత బాబాయికి టిటిడి చైర్మన్ పదవి కట్టబెట్టారు.
ఇటువంటి నియామకాల కారణంగా తిరుమల పవిత్రత మంటగరిపి పోతున్నదనే విమర్శలు చెలరేగుతున్నాయి. రాజశేఖరరెడ్డి హయం నుండి అక్కడ క్రైస్తవ మత కార్యక్రమాలు జరుగుతూ ఉండడం, మతమార్పిడి ప్రయత్నాలు కూడా జరగడం చూస్తున్నాము. టిటిడి సిబ్బందిలో అన్యమతస్థులు తొలగించాలని న్యాయస్థానాలు స్పష్టం చేస్తినా ప్రభుత్వాలలో కదలిక కనబడటం లేదు. తిరుమల పవిత్రత పరిరక్షణ కోసం ప్రముఖులు, హిందూ సంస్థలు భారీ ఉద్యమాలు చేపట్టవలసి వచ్చింది.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత టిటిడిని ఆయన వ్యాపార సామ్రాజ్యం కోసం, రాజకీయ పునరావాసాల కోసం, ఆర్థిక అవసరాల కోసం, సీబీఐ కోర్టులో ఎదుర్కొంటున్న అవినీతి కేసులలో ఉపయోగపడే వాళ్లకోసం టిటిడి  చరిత్రలో లేని విధంగా పాలకవర్గం సభ్యుల సంఖ్యను పలు రేట్లు పెంచివేస్తున్నారని బిజెపి నేత కరణం భాస్కర్ విమర్శించారు.
ప్రస్తుతం నియమించిన ప్రత్యేక ఆహ్వానితులలో, ఈ బోర్డు సభ్యులలో కొంతమంది  ఆర్థిక నేరగాళ్లు, సిబిఐ కేసులలో ముద్దాయిలు, అరాచక ,అవినీతి చరిత్ర కలిగిన వారు, ధర్మం పట్ల విశ్వాసం లేని వారు, 70 శాతం మంది ఇతర రాష్ట్రాల వారు ఉన్నారు. వీరిలో  ఎవరు కూడా టిటిడిని అభివృద్ధి చేసే దానికో లేదా ధార్మికమైన  సలహాలు ఇచ్చేందుకు పనికిరారని భాస్కర్ స్పష్టం చేశారు.
పైగా, ఈ పాపంలో బిజెపికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు తెలియచెప్పడం కోసం వీరిలో కొందరిని  బిజెపి అగ్ర నాయకులు, కేంద్ర మంత్రులు, సిఫార్సు చేశారని చెప్పి ప్రచారం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక ఆహ్వానితుడినా నియమితుడైన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త యలిశాల రవిప్రసాద్ ని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సిఫార్సుపై నియమించినట్లు మీడియాకు లీక్ ఇవ్వడం గమనార్హం.
 
స్వయంగా తాను గాని, తన మంత్రిత్వ శాఖ గాని అతని పేరును సిఫార్సు చేయలేదని అంటూ కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి లేఖ వ్రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించని లేదు.  వైసీపీకి ఎలాంటి సంబంధం లేని అతనికి ఆ హోదా ఎలా వచ్చిందని అటు వైసీపీ నేతలు.. బీజేపీలో ఎలాంటి పదవి లేనందున ఆయనకు ఎవరు సిఫార్సు చేశారని ఇటు బీజేపీ నేతలు తలపట్టుకొనే పరిస్థితి కల్పించారు.