కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేలు

కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించినట్టు కేంద్రప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ పరిహారాన్ని రాస్త్రాలు తమ విపత్తు నిర్వహణ నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) నుంచి అందజేస్తాయని పేర్కొన్నది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది. 

పరిహారం పొందడానికి కేంద్ర ఆర్యోగ, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఐసిఎంఆర్‌ ఇప్పటికే జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం మరణం సంభవించి ఉండాలని, ఆ మేరకు అవసరమైన ధృవ పత్రాలను సమర్పించిన 30 రోజుల్లోపు పరిహారం ఆధార్‌తో అనుసరధానం చేసిన బ్యాంకు ఖాతాల్లో చెల్లిస్తారని వివరించింది. 

పరిహారంపై ధ్రువపత్రాల పరిశీలన, పరిహారం అందజేత జిల్లా స్థాయి విపత్తు నిర్వహణ సంఘం (డీడీఎంఏ)/జిల్లా అధికార యంత్రాంగం చేతుల్లో ఉంటుందని అఫిడవిట్‌లో పేర్కొన్నది. బాధిత కుటుంబం ధ్రువపత్రాలు సమర్పించిన 30 రోజుల్లో పరిహారం అందించే ప్రక్రియ పూర్తి అవుతుందని, పరిహారం చెల్లింపులో సమస్యల పరిష్కారానికి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌, వైద్యాధికారులతో కూడిన కమిటీ ఉంటుందని వెల్లడించింది.

ఫిర్యాదులను అదనపు జిల్లా కలెక్టర్‌, వైద్య విభాగం చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌(సీఎంఓహెచ్‌), అదనపు సీఎంఓహెచ్‌, స్థానిక మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ లేదా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెడిసిన్‌ విభాగాధిపతిల కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుందని తెలిపింది. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్‌డీఎంఏ) ఈ నెల 11నే మార్గదర్శకాలు విడుదల చేసినట్టు సుప్రీంకోర్టుకు చెప్పింది.

ఇప్పటిదాకా సంభవించిన మరణాలే కాకుండా ఇక ముందు సంభవించే కరోనా మరణాలకు కూడా ఈ నిబంధనలే వర్తిస్తాయని వెల్లడించింది. కరోనా నియంత్రణ చర్యలకు ఎస్డీఆర్‌ఎఫ్‌ నిధులను వాడుకోవడానికి కేంద్రం గతంలో అనుమతి ఇచ్చింది. మరోవైపు తుఫాన్లు, భారీ వర్షాల కారణంగా అనేక రాష్ట్రాలలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు నిండుకొన్నాయి. పరిహారం కోసం రాష్ట్రప్రభుత్వాలు ప్రత్యేక ఫారాన్ని రూపొందించి విడుదల చేస్తాయి.

దరఖాస్తు చేసుకొనే వారు మృతుడి ధ్రువపత్రాన్ని డాక్యుమెంట్లతో జమ చేయాలి. డెత్‌ సర్టిఫికెట్‌ ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం ఉండాలి. మృతికి గల కారణం’ కచ్చితంగా ఉండాలి. ధ్రువ పత్రాలపై ఐసీఎంఆర్‌ ఇప్పటికే మార్గదర్శకాలు జారీచేసింది. డీడీఎంఏ/జిల్లా అధికార యంత్రాంగం పరిహారాన్ని కుటుంబాలకు అందజేస్తుంది. పరిహారాన్ని మృతుడి కుటుంబంలో ఒకరికి ఆధార్‌ లింక్‌ ఉన్న బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు.

4 వారాలకే కొవిషీల్డ్‌ రెండో డోసు!

ఇలా ఉండగా, కొవిషీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని కేంద్ర ప్రభుత్వం మరోసారి సవరించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మొదటి డోసు తీసుకున్నాక 12-16 వారాల్లోగా రెండో డోసు తీసుకోవాలనే నిబంధన అమ ల్లో ఉంది. ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లలో కొవిషీల్డ్‌ తీసుకున్న వారికి 4 వారాల తర్వాత రెండో డోసు తీసుకునే అవకాశం కల్పించాలని సర్కారు యోచిస్తోంది.

కాగా, దేశంలో యాక్టివ్‌ కరోనా కేసుల సంఖ్య 6 నెలల కనిష్ఠానికి తగ్గి 3,01,989కి చేరింది. 26,964 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3.35 కోట్లు దాటింది. మరో 383 కరోనా మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 4.45 లక్షలకు చేరింది.