‘ఘాజీల భూమిపై గర్జిద్దాం’.. ఎంఐఎం పోస్టర్‌ వివాదం

‘ఘాజీల భూమిపై గర్జిద్దాం’.. ఎంఐఎం పోస్టర్‌ వివాదం

ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విడుదల చేసిన పోస్టరొకటి ఉత్తరప్రదేశ్‌లో వివాదానికి దారితీసింది. ‘ఘాజీల భూమిపై గర్జిద్దాం’ అని రాసి ఉన్న పోస్టర్‌ బుధవారం నాటి బహిరంగ సభలో ప్రధాన ఆకర్శణగా నిలిచింది. అయితే, ఈ పోస్టర్‌పై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పోస్టర్లను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం ఒవైసీకి తగదని హితవు పలికింది.

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) బుధవారం నిర్వహించిన ర్యాలీ, బహిరంగ సభ వేదికపై ఉంచిన పోస్టర్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ జిల్లాలో చేపట్టిన ర్యాలీలో ‘ఘాజీల భూమి’ అన్న అర్ధం వచ్చే పోస్టర్‌ను ఉంచారు. సంభాల్‌ జిల్లాను ఘాజీల భూమిగా ఎంఐఎం పేర్కొంటున్నది.

ఇంతకుముందు ఒవైసీ అయోధ్య జిల్లా పర్యటన సందర్భంగా అయోధ్య జిల్లాను ఫైజాబాద్‌ అని పేర్కొంటూ పోస్టర్లు ముద్రించి అంటించారు. అప్పుడు కూడా ఎంఐఎం పోస్టర్లపై తీవ్ర దుమారం చెలరేగింది. ఇది ముమ్మాటికీ ద్వేషపూరిత చర్యతో కూడుకున్న పోస్టర్‌ అని బీజేపీ విమర్శించింది.

ఇలాంటి పేర్లను తీసుకురావడం ద్వారా మైనార్టీ ఓట్లను పొందాలని ఒవైసీ చూస్తున్నారని బీజేపీ ఉపాధ్యక్షుడు రాజేశ్‌ సింఘాల్‌ ఆరోపించారు. భారతదేశంలో ఏ నగరం కూడా ఘాజీలది కాదని ఆయన స్పష్టం చేశారు.  ఖురాన్‌లో సంభాల్‌ ప్రాంతాన్ని ఘాజీల భూమిగా వర్ణించినట్లు చూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ విసిరారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2018 నవంబర్‌లో ఫైజాబాద్ డివిజన్‌ను అయోధ్యగా మార్చింది. కాగా, మంగళవారం ఢిల్లీలోని అశోక రోడ్డులో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అధికారిక నివాసంపై దాడి చేసి ధ్వంసం చేసిన ఘనటలో ఐదుగురు హిందూ సేన సభ్యులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 

403 మంది సభ్యులున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే నెల ప్రారంభంలో ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో కనీసం 100 నియోజకవర్గాల్లో తన అభ్యర్థును నిలుపాలని ఎంఐఎం భావిస్తున్నది.